హిమాచల్ ప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ..కొత్తగా ఏడుగురికి చోటు

హిమాచల్ ప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ..కొత్తగా ఏడుగురికి చోటు

హిమాచల్‌ ప్రదేశ్‌లో నూతన మంత్రి వర్గం  కొలువు దీరింది. షిమ్లాలోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ సహా  ఏడుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన  ధనిరామ్ శాండిల్వ, హర్షవర్దన్ చౌహాన్, జగత్ సింగ్ నేగి, విక్రమాదిత్య సింగ్, చందర్ కుమార్, అనిరుధ్ సింగ్, రోహిత్ ఠాకూర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకుతో పాటు డిప్యుటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి పాల్గొన్నారు.


సిమ్లా జిల్లా నుంచే ముగ్గురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.  ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఆ జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం. ఇక బిలాస్‌పూర్, మండి, లాహౌల్, స్పితి జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభించలేదు. తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌  రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ధని రామ్ శాండిల్ సోలన్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ  మంత్రి చందర్ కుమార్ కాంగ్రా జిల్లాలోని జవాలి నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  సిర్మౌర్ జిల్లాలోని షిల్లై నుంచి హర్షవర్ధన్ చౌహాన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ జగత్ సింగ్ నేగి  గిరిజన కిన్నౌర్ జిల్లా నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కేబినెట్ లో స్థానం దక్కిన  రోహిత్ ఠాకూర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా...అనిరుధ్ సింగ్  మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 


2022 డిసెంబర్ 11న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా సుఖ్విందర్ సింగ్,  డిప్యూటి సీఎంగా  ముఖేష్ అగ్ని హోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం కొలువుదీరిన 28 రోజుల తరువాత మంత్రివర్గాన్ని విస్తరించారు. మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మంత్రుల సంఖ్య గరిష్టంగా 12మందికి మించకూడదు. ప్రస్తుతం తొమ్మిది మంది మంత్రులున్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు మూడు బెర్తులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.