ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్‌

ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్‌

ఎడతెరిపి లేని వానలు..వరదల వల్ల భారీగా  ఆస్తి, ప్రాణ నష్టం కారణంగా  హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ  రాష్ట్రాన్ని 'ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం'గా  ప్రకటించింది. ఈ మేరకు హిమాచల్ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. 

హిమాచల్ ప్రదేశ్‌లో "ప్రస్తుత వర్షాకాలంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదల వల్ల కొండచరియలు విరిగిపడి  భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. వేల సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి.  పంటలు, వ్యవసాయ భూమి నాశనం అయింది. వరదల వల్ల ఎంతో మంది పర్యాటకులు, స్థానిక ప్రజలు గల్లంతయ్యారు. చాలా మంది కొండచరియల కింద చిక్కుకుపోయారు. వీరి కోసం  భారతీయ వైమానిక దళం, సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, హోంగార్డులు, ఫైర్ సర్వీసెస్, స్థానిక వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారులు, రోడ్ నెట్‌వర్క్‌లు, వంతెనలు కొట్టుకుపోయాయి. "అందుకే  ప్రాణనష్టం, ఆస్తి నష్టం, విధ్వంసం, ప్రభుత్వ మౌలిక సదుపాయాల నష్టం,  ప్రైవేట్ ఆస్తులకు తీవ్రమైన నష్టం సంభవించిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని "ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం"గా ప్రకటించాలని నిర్ణయించింది. " అని  ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని  జిల్లాల సంబంధిత శాఖల ద్వారా పశుసంపద, మౌలిక సదుపాయాలు, పంటల నష్టం, ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి అంచనా వేయబడుతుందని వెల్లడించింది.

జూన్ 24 న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి, హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలకు సంబంధించిన సంఘటనలలో 217 మంది మరణించారు. ఆగస్టు 13వ తేదీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని కురిసిన భారీ వర్షాలకు సిమ్లాతో సహా పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి కనీసం 75 మంది మరణించారు.  అలాగే వందల సంఖ్యలో జాతీయ రహదారులు, రహదారులు, రైల్వేలు, ప్రధాన వంతేనలు నేలమట్టం అయ్యాయి. 11,301 ఇళ్లు  దెబ్బతిన్నాయని హిమాచల్ రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం తెలిపింది. వానల కారణంగా  రాష్ట్రానికి రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు ఏడాది సమయం పడుతుందని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.