రెండో పెళ్లి చేస్కుంటే ఏడేండ్లు జైలు..అస్సాం అసెంబ్లీలో పాలిగమి బిల్లు పాస్

రెండో పెళ్లి చేస్కుంటే ఏడేండ్లు జైలు..అస్సాం అసెంబ్లీలో పాలిగమి బిల్లు పాస్
  • పాలిగమీపై నిషేధం విధించిన అస్సాం ప్రభుత్వం.. బిల్లు పాస్ చేసిన అసెంబ్లీ

గువహటి: బహుభార్యత్వం, బహుభర్తృత్వం(పాలిగమీ) పై నిషేధం విధిస్తూ అస్సాం అసెంబ్లీ గురువారం బిల్లు పాస్  చేసింది. రాష్ట్రంలో ఇకపై భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే ఏడేండ్ల జైలుశిక్ష పడేలా హిమంత బిశ్వ శర్మ సర్కారు బిల్లును రూపొందించింది. అంతేకాకుండా బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘అస్సాం బహుభార్యత్వ నిషేధ బిల్లు 2025’ ని సీఎం హిమంత పాస్  చేశారు. 

బిల్లు నిబంధనల ప్రకారం.. మొదటి భాగస్వామితో కలిసి ఉంటూనే ఎవరైనా అక్రమంగా రెండో పెళ్లి చేసుకుంటే వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే, ఒకసారి పెళ్లి అయిందనే విషయం దాచిపెట్టి మళ్లీ వివాహం చేసుకుంటే పదేండ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్డ్ తెగలు, ఏరియాలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

కాగా, అసెంబ్లీలో ఈ బిల్లును పెడుతూ.. మహిళల హక్కుల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదని సీఎం హిమంత స్పష్టం చేశారు. నారీ శక్తిని చాటేలా ఈ బిల్లును రూపొందించామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్  కోడ్​ను అమల్లోకి తెస్తామని  సీఎం వెల్లడించారు.

పాలిగమీపై బిల్లు ఏం చెప్పిదంటే..

ఇప్పటికే పెండ్లయి లేదా చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా భాగస్వామితో కలిసి ఉంటూ లేదా తమ దాంపత్య జీవితాన్ని చట్టబద్ధంగా ముగించకుండా రెండో వివాహం చేసుకోవడాన్ని  బహుభార్యత్వంగా బిల్లు నిర్వచించింది.