ఓ వైపు సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ చేసిన నిర్మాత దిల్ రాజు.. మరోవైపు అక్షయ్ కుమార్‌తోనూ ఓ సినిమా చేస్తున్నారు. అనీస్ బజ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ సరసన విద్యాబాలన్, రాశీఖన్నా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ కామెడీ డ్రామాకు సంబంధించి మంగళవారం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 4న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కి ఇది రీమేక్ అని సమాచారం. తెలుగులో ఐశ్వర్య రాజేష్ కనిపించిన పాత్రను విద్యాబాలన్, మీనాక్షి పాత్రను రాశీఖన్నా పోషిస్తున్నారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ కలిసి ఇప్పటికే ‘భూల్ భులయ్యా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో పాటు హేయ్ బేబీ, మిషన్ మంగల్ చిత్రాల్లో నటించారు.
ఇక పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత అక్షయ్, అనీస్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వెల్‌కమ్, సింగ్ ఈజ్ కింగ్, థాంక్యూ సినిమాలొచ్చాయి. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్ డైరెక్షన్‌లో ‘భూత్ బంగ్లా’ సినిమా చేసి హిట్ అందుకున్న అక్షయ్ కుమార్.. 15 ఏళ్ల తర్వాత అనీస్‌తో చేస్తున్న ఈ కామెడీ డ్రామాతో మరో సక్సెస్ అందుకుంటాడనే అంచనాలు నెలకొన్నాయి.
