- తరలివచ్చిన వందలాది భక్తులు
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడ నుంచి మందమర్రి మండలం బొక్కలగుట్ట రుష్యమూక పర్వతం వరకు చేపట్టిన మహా పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. గురువారం హమాలీవాడలోని శ్రీభక్త ఆంజనేయస్వామి దేవాలయం నుంచి హిందూ ఉత్సవ సమితి సభ్యులుపెద్ద సంఖ్యలో పాదయాత్రగా 12 కిలోమీటర్ల దూరంలోని బొక్కలగుట్టకు చేరుకున్నారు. వీరికి గ్రామ సర్పంచ్ మాసు శ్రీనివాస్, గ్రామస్తులు, రుష్యమూక పర్వత కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అందరు కలిసి గోమాతతో గిరిప్రదక్షణ నిర్వహించారు.
చీఫ్ గెస్ట్‌గా రఘు అఘోరి గురుస్వామి హాజరయ్యారు. హిందువుల ఐక్యతను చాటుతూ ప్రతి ఏటా డిసెంబర్ 25న ఈ యాత్ర చేపడుతున్నామని, హిందువుల మీద జరుగుతున్న దాడులు, గోహత్యలు, మతమార్పిడుల గురించి ప్రజలకు వివరిస్తూ అప్రమత్తం చేస్తున్నామని హిందూ ఉత్సవ సమితి సభ్యుడు కర్ణకంటి రవీందర్ తెలిపారు.
సంఘటితమే మహాబలమని, గో హత్యలు నివారించడం, మతమార్పిడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మహాపాదయాత్రలో భాగంగా కాసిపేట మండలం కొమిటి చేను, జైపూర్మండలం రసూల్‌పల్లి కోలాట బృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హిందూ ఉత్సవ సమితి సభ్యులు, వికాస తరంగిణి సభ్యులు, నేచురల్ అనిమల్ కేర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
