ఒకే వేదికపై హిందూ ముస్లిం జంటల పెళ్లి

ఒకే వేదికపై హిందూ ముస్లిం జంటల పెళ్లి

 భారీ వర్షం కారణంగా మతసామరస్యం వికసించింది. ఒకే వేదికపై హిందూ,ముస్లీం వివాహాలు జరిగాయి. ఈ ఘటన మే 20న పూణెలో జరిగింది.

 

మే 20న పూణెలోని  సాయంత్రం 6.56 గంటలకు  వాన్వోరీ ప్రాంతంలోని అలంకార్ లాన్స్ లో  హిందూ జంట సంకృతి కావడే, నరేంద్ర గలాందే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే అనుకోకుండా భారీ వర్షం కురిసింది. బహిరంగ వేదిక కావడంతో   వధూవరులు, బందువులు వర్షంలో తడిసిపోయారు. అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పెళ్లి ఆగిపోయేలా ఉందని టెన్షన్ పడ్డారు.

అదే సమయంలో  దగ్గర్లోని ఓ ఫంక్షన్ హాల్ కు వెళ్లి మరో వేదిక ఉంటే ఇవ్వాలని అడిగారు. అయితే వేదిక ఖాళీ లేదని ఫంక్షన్ హాల్ యజమాని చెప్పాడు. లోపల పెళ్లి జరుగుతోందని..వాళ్లని అడగండని ఓ సలహా ఇచ్చాడు. దీంతో హిందూ జంట తరపున వారు ముస్లీం జంట తల్లిదండ్రులకు పరిస్థితి వివరించారు. పెళ్లి మధ్యలో ఆగిపోతుందని వేదికపై చోటిస్తే తమ పిల్లల పెళ్లి చేస్తామని చెప్పారు. వెంటనే ముస్లిం కుటుంబం అంగీకరించి వేదికను ఖాళీ చేసింది. 

తర్వాత సామాగ్రిని తరలించి అదే వేదికపై పెళ్లి చేశారు హిందూ జంట తల్లిదండ్రులు. రెండు మతాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ ఎవరి పద్దతుల్లో వారు పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి వేడుకు చూసిన వారంతా సంబురపడిపోయారు. తర్వాత హిందూ అతిథులను తమ విందుకు ఆహ్వానించారు ముస్లీం పెళ్లి వారు.  ముస్లిం జంట మహీన్  మొహ్సిన్ కాజీ,  హిందూ జంట సంకృతి కావడే నరేంద్ర గలాందే కలిసి ఒకే వేదికపై ఫోటోలు దిగారు. కులమతాల కంటే మానవత్వమే ముఖ్యమని చూపించారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.