డచ్‌‌‌‌ నుంచి వచ్చిన డాల్డా

డచ్‌‌‌‌ నుంచి వచ్చిన డాల్డా

వనస్పతి నూనె, వెజిటబుల్‌‌‌‌ నెయ్యి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ.. ‘డాల్డా’ అంటే మాత్రం తెలియనవాళ్లు ఉండరు. ఈ బ్రాండ్‌‌‌‌ పేరు అంత పాపులర్ మరి. ఒకప్పుడు ఏ దావత్‌‌‌‌లో చూసినా వనస్పతితో వండిన వంటలు కనిపించేవి. అంతెందుకు పెద్ద రెస్టారెంట్లలో కూడా డాల్డా వాడేవాళ్లు. అందుకే 1980ల వరకు అమ్మకాల్లో డాల్డాకు పోటీనే లేదు. కానీ.. ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నో వివాదాలు తలెత్తాయి. సేల్స్‌‌‌‌ దారుణంగా పడిపోయాయి. అయితే ఎన్నిసార్లు పడినా.. మళ్లీ లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తూనే ఉంది డాల్డా. 

ఇండియాలో దాదాపు ప్రతి ఇంట్లో నెయ్యి వాడతారు. ఇండియన్స్‌‌‌‌ కిచెన్‌‌‌‌లోని ఖరీదైన పదార్థాల్లో నెయ్యి ఒకటి. అందుకే పిల్లలకు అందకుండా నెయ్యిని పై షెల్ఫ్‌‌‌‌ల్లో జాగ్రత్తగా దాస్తుంది అమ్మ. పిల్లలు వేసుకుంటామన్నా.. ఎక్కడ నేల పాలు చేస్తారో అనే భయంతో తానే స్వయంగా కిచెన్‌‌‌‌లోకి వెళ్లి పిల్లలు తినే పళ్లెంలో కావాల్సినంత వేస్తుంది. అంత విలువైన నెయ్యికి ఆల్టర్నేట్‌‌‌‌గా తీసుకొచ్చిందే వనస్పతి నూనె. దీన్ని ఇండియాకు తీసుకొచ్చింది డచ్‌‌‌‌ వాళ్లు అయినపన్పటికీ ‘డాల్డా’ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాక అందరికీ చేరువయ్యింది. 

అయితే.. ఈ నూనెను డాల్డా కంపెనీవాళ్లు ‘వెజిటబుల్‌‌‌‌ ఘీ’ అని ప్రచారం చేసినా.. జనాలు ఆ పదార్థం పేరే ‘డాల్డా’ అనుకున్నారు.  ఆ కంపెనీ తెచ్చిన ప్రొడక్ట్స్​ అంతలా ఫేమస్‌‌‌‌ అయ్యాయి. డాల్డా అనగానే పాతవాళ్లకు చాలామందికి పసుపు రంగు కంటైనర్‌‌‌‌.. దాని మీద ఉండే ఆకుపచ్చని పామ్‌‌‌‌ ట్రీ గుర్తొస్తాయి. ఆ డబ్బాకు కూడా బోల్డెంత రికగ్నిషన్​ అన్నమాట.  దాదాపు 50 ఏండ్ల పాటు ఇండియాలో చాలా ఇంపాక్ట్ చూపించింది ఈ డాల్డా. అంతెందుకు దాన్ని వాడుతున్న వాళ్లలో చాలామందికి అది ఒక విదేశీ కంపెనీ ప్రొడక్ట్ అని కూడా తెలియదు. 

లివర్ బ్రదర్స్‌‌‌‌ 

డచ్ వ్యాపారులు నెయ్యికి ప్రత్యామ్నాయంగా 1930ల్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్ (వనస్పతి నూనె)ని ఇండియాకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌‌‌‌కు చెందిన లివర్ బ్రదర్స్ యూరప్‌‌‌‌లో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్‌‌‌‌ మొదలుపెట్టారు. ఆ వ్యాపారాన్ని విస్తరిస్తూ ఇండియాకు వచ్చారు. మన దగ్గర నెయ్యి చాలా ఖరీదైనది. అయినప్పటికీ చాలామంది రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వాడుతున్నారని గమనించారు. 

అందుకే నెయ్యిలాగానే ఉండే హైడ్రోజనేటెడ్ ఆయిల్‌‌‌‌ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. దాంతో 1931లో ఇండియాలో హిందుస్తాన్ వనస్పతి మాన్యుఫాక్చరింగ్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ మొదలుపెట్టారు. ఇండియాలోని సెవ్రీలో (ఇప్పుడు గ్రేటర్ ముంబైలో ఉంది) 1932లో ఫ్యాక్టరీని  ఏర్పాటుచేశారు. డచ్‌‌‌‌ల నుండి వనస్పతి నెయ్యి తయారీ హక్కులను కొని,  ప్రొడక్షన్ మొదలుపెట్టారు. 

ఆ పేరు వెనక..

డచ్‌‌‌‌ వ్యాపారులు వనస్పతి నూనెకు ‘దాదా’ అని పేరు పెట్టారు. లివర్ బ్రదర్స్‌‌‌‌కి తయారీ హక్కులను అమ్మినప్పుడు దానికి ఆ పేరు అలాగే ఉంచాలని కండిషన్‌‌‌‌ కూడా పెట్టారు. కానీ.. లివర్‌‌‌‌‌‌‌‌ బ్రదర్స్ అందుకు ఒప్పుకోలేదు. ‘దాదా’ పేరు అప్పటికే మార్కెట్‌‌‌‌లో ఉంది. కాబట్టి ఇది కొత్త ప్రొడక్ట్‌‌‌‌ అని తెలియాలంటే పేరులో స్వల్పంగా అయినా మార్పులు చేయాలని పట్టుపట్టారు. చివరకు లివర్‌‌‌‌‌‌‌‌ బ్రదర్స్‌‌‌‌లోని మొదటి అక్షరం ‘L’ని ‘dada’ పేరు మధ్యలో పెట్టాలని డిసైడ్​ అయ్యారు. అందుకే డచ్ వ్యాపారులను ఒప్పించి చివరకు ‘డాల్డా’గా పేరు మార్చారు. అలా 1937లో ‘డాల్డా’ పుట్టింది. 

మార్కెటింగ్‌‌‌‌ 

అయితే లివర్‌‌‌‌‌‌‌‌ బ్రదర్స్‌‌‌‌ దీన్ని మార్కెట్​లోకి తీసుకొచ్చాకే అసలు సమస్య మొదలైంది. ఇండియాలో దొరికే దేశీ నెయ్యి లేదా ఆవు పాలతో తయారుచేసిన నెయ్యికి ప్రత్యామ్నాయంగా చౌకగా దొరికేది ఈ డాల్డా అని మార్కెటింగ్ చేయడం చాలా కష్టమైంది. సాధారణంగా వారాంతాల్లో చేసుకునే స్పెషల్ వంటల్లో, స్వీట్లలో నెయ్యిని ఎక్కువగా వాడుతుంటారు. అందుకని దాని అవసరం చాలా తక్కువగానే ఉంటుంది. పైగా అప్పట్లో ఎక్కువమంది నెయ్యిని కొనేవాళ్లు కాదు. ఇంట్లోనే తయారుచేసుకునేవాళ్లు. వంటకాల మీద నెయ్యి చల్లినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసన, రుచి వస్తాయి. 

అలాంటి రుచి, వాసన వనస్పతి ఇవ్వలేకపోయింది. అయినా.. ఇది నెయ్యికి ‘ప్రత్యామ్నాయం’ అని  బలంగా చెప్పడానికి రకరకాల మార్కెటింగ్ వ్యూహాలతో ప్రచారం చేశారు. ముఖ్యంగా వనస్పతికి డీప్–ఫ్రైయింగ్ లక్షణాలు ఉన్నాయని జనాలను నమ్మించేందుకు అడ్వర్టైజ్‌‌‌‌మెంట్స్‌‌‌‌ కూడా చేశారు. ప్రచార బాధ్యతలను ‘లింటాస్‌‌‌‌’ అనే యాడ్​ ఏజెన్సీకి అప్పగించారు. ఈ కంపెనీ1939 సంవత్సరంలో ఇండియాలో మొట్టమొదటి మల్టీ–మీడియా అడ్వర్టైజ్​మెంట్​ని ప్రచారం చేసింది. థియేటర్లలో అడ్వర్టైజ్‌‌‌‌ చేయడానికి డాల్డాలో పూరీలు వేగించే ఒక వీడియో షూట్​ చేశారు. 

గుండ్రని టిన్ ఆకారంలో ఉండే వ్యాన్లతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. పాంప్లెట్స్‌‌‌‌ కూడా పంచిపెట్టారు. వీధుల్లో రోడ్ల పక్కన స్టాల్స్ పెట్టి అటుపక్క నుంచి నడుస్తూ వెళ్లే వాళ్లకు డాల్డాతో చేసిన వంటకాలను రుచి చూపించారు. అక్కడే వండుతూ.. వండేటప్పుడు వచ్చే సువాసనతో కూడా ప్రచారం చేశారు. ఇలా విపరీతంగా యాడ్స్ చేయడం వల్ల డాల్డా ధర చాలా తక్కువని అందరికీ తెలిసింది. అలా అమ్మకాలు పెరిగాయి. 

కొన్నాళ్లకే బ్రాండ్ గురించి అందరికీ తెలిసింది. ‘డాల్డా’ అనే పేరు ‘వనస్పతి నెయ్యి’కి పర్యాయపదంగా మారింది.1980ల వరకు ఇండియన్ మార్కెట్లలో సేల్స్ చాలా జరిగాయి. పైగా ఇది మార్కెట్‌‌‌‌లోకి వచ్చాక మొదటి 25–30 ఏండ్ల వరకు స్థానికంగా, ఇంటర్నేషనల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో ఎడిబుల్ ఆయిల్(వంటకు వాడే నూనె) కంపెనీల నుంచి అంత పోటీ కూడా లేదు. అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఆకారాల్లో, సైజుల్లో నెయ్యి డబ్బాలను తెచ్చింది. డిఫరెంట్‌‌‌‌గా ఉండే టిన్‌‌‌‌లను తీసుకొచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడేందుకు పెద్ద సైజులో ఉండే చదరపు ఆకారపు టిన్స్​, ఇండ్లలో వాడేందుకు గుండ్రంగా ఉండే చిన్న టిన్స్​ తీసుకొచ్చింది.

మళ్లీ వెలుగులోకి

ఒకప్పటి ఐకానిక్ బ్రాండ్.. అయినా దాన్ని మళ్లీ మార్కెట్‌‌‌‌లో నిలబెట్టడం ‘బంజ్‌‌‌‌’ కంపెనీకి అంత ఈజీ కాలేదు. అందుకు కారణం.. మార్కెట్‌‌‌‌లో విపరీతమైన పోటీ పెరిగిపోవడమే. బ్రాండ్‌‌‌‌ని రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ముందుగా ప్యూరిటీపై జనాలకు నమ్మకం కలిగేలా చేయాలి అనుకున్నారు. అందుకే కొన్నేండ్ల పాటు నష్టాలు వస్తున్నా.. బంజ్‌‌‌‌ కంపెనీ ప్రకటనలు ఇస్తూనే ప్రొడక్షన్‌‌‌‌ని పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అంతేకాకుండా.. 2007లో మార్కెట్‌‌‌‌లోకి రిఫైన్డ్‌‌‌‌ ఎడిబుల్‌‌‌‌ ఆయిల్స్‌‌‌‌ని కూడా తీసుకొచ్చింది. ‘హజ్బెండ్స్ ఛాయిస్’ అనే ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌తో ప్రచారం చేశారు. అయినా.. మార్కెట్‌‌‌‌లో క్లిక్ కాలేదు. దాంతో మళ్లీ 2013లో మరికొన్ని ప్రొడక్ట్స్‌‌‌‌ని కలిపారు. ‘డబ్బా ఖాళీ.. పేట్​ ఫుల్’ (టిఫిన్ బాక్స్ ఖాళీ అయింది. కడుపు నిండింది) అనే ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌తో మార్కెట్‌‌‌‌లోకి తెచ్చారు. ప్రస్తుతం డాల్డా బ్రాండ్‌‌‌‌ పేరుతోనే సోయాబీన్, సన్‌‌‌‌ఫ్లవర్‌‌‌‌‌‌‌‌, పామోలివ్ ఆయిల్ లాంటి వాటిని మార్కెట్‌‌‌‌లో అమ్ముతున్నారు. 

అమ్మకాలు పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇండియాస్‌‌‌‌ కిచెన్‌‌‌‌ కింగ్‌‌‌‌ చెఫ్​ సంజీవ్ కపూర్‌‌‌‌‌‌‌‌తో అడ్వర్టైజ్​మెంట్స్​ చేయించారు. ఇలా.. ఎన్నో ప్రయత్నాల తర్వాత మళ్లీ అమ్మకాలు కాస్త పెరిగాయి. కానీ.. మార్కెట్‌‌‌‌లో అనుకున్నంత బలంగా ఇంకా నిలబడలేదనే చెప్పాలి. 2017–18 నుండి 2018–19 వరకు  కంపెనీ నికర విలువ 8.05 శాతం వృద్ధిని సాధించింది. 

వివాదాలు– సమస్యలు

వనస్పతి నూనె ప్రొడక్షన్‌‌‌‌ని నిషేధించాలని 1950ల్లో దేశవ్యాప్తంగా చాలామంది వాదించారు. అప్పుడు డాల్డా పెద్ద వివాదాన్ని ఎదుర్కొంది. డాల్డా అనేది ఫాల్స్ ప్రొడక్ట్‌‌‌‌ అని ‘ఇమిటేటెడ్‌‌‌‌ ఘీ’ అని  ప్రచారం జరిగింది. కొందరైతే ‘దేశీ నెయ్యి కల్తీ వెర్షన్’ అన్నారు. అందులో ఉండే హై శాచ్యురేటెడ్‌‌‌‌ ఫ్యాట్‌‌‌‌ వల్ల ఆరోగ్యానికి హానికరమని మేధావులు చెప్పారు. దాంతో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. కానీ.. వాదనలు నిరూపించలేదు. నెయ్యి కల్తీని నిరోధించడానికి వేసిన కమిటీ ఇచ్చిన ఫలితాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. దాంతో డాల్డా ఈ వివాదం నుంచి బయటపడింది.

ఆ  వివాదం1950ల్లో పూర్తయ్యాక మళ్లీ సేల్స్ పెరిగాయి. కానీ.. కొన్నేండ్ల తర్వాత 90వ దశకంలో మళ్లీ అదే సమస్య వచ్చింది. డాల్డా ఉత్పత్తి చేస్తున్న వనస్పతి (వెజిటబుల్‌‌‌‌ నెయ్యి)లో జంతువుల కొవ్వు ఉందని, అది తినడానికి పనికిరాదని ఆరోపణలు వచ్చాయి. కొన్నిసార్లు నెగెటివ్‌‌‌‌ పబ్లిసిటీ కూడా పాజిటివ్‌‌‌‌గానే మారుతుందనే సిద్ధాంతం ఇక్కడ ఫలించలేదు. 

అప్పటికే మార్కెట్​లోకి చాలా కంపెనీల ఎడిబుల్​ ఆయిల్‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌ వచ్చేశాయి. అవి ఆరోగ్యకరమైనవి అని జనాలు నమ్మారు. దాంతో డాల్డా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. తక్కువ టైంలోనే దాని మార్కెట్ షేర్లు పడిపోయాయి. అందుకే అప్పటివరకు హిందూస్తాన్ యూని లివర్‌‌‌‌‌‌‌‌ ప్రొడ్యూస్‌‌‌‌ చేసే ఈ బ్రాండ్‌‌‌‌ను 2003లో అమెరికన్ ఫుడ్ అండ్ అగ్రి కంపెనీ ‘బంజ్‌‌‌‌’కి 90 కోట్ల రూపాయలకు అమ్మేసింది.