సందర్భం : చరిత్రలో అరుదైన త్యాగం

సందర్భం : చరిత్రలో అరుదైన త్యాగం

ఇబ్రహీం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్మాయిల్ ప్రాణత్యాగానికి సిద్ధపడిన రోజు ఈద్ ఉల్ అజ్హా (బక్రీద్) పండుగ జరుపుకుంటారు. త్యాగానికి గుర్తుగా మేకలు, పొట్టేళ్లను ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ.

బక్రీద్ అంటే ‘బకర్ ఈద్’ అని అర్థం. ‘బకర్’ అంటే జంతువు. ‘ఈద్’ అంటే పండుగని అర్థం. జంతువును ఖుర్బానీ ( దానం ) ఇచ్చే పండుగ కాబట్టి ‘ఈదుల్ ఖుర్బాని’ అని కూడా అంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని ‘హిజ్రీ’ అనే పేరుతో పిలుస్తారు. ‘హిజ్రీ’ అంటే వలస పోవడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాల్లో ఒకటి. త్యాగనిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవత్వాన్ని వెదజల్లాలి అన్నదే బక్రీద్ పండుగ వెనక దాగిన అర్థం.

కోడి పుంజు ఇవ్వరాదు

బక్రీద్ పండుగ రోజున ముస్లింలు ఖుర్బానీ ఇస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్​ ప్రకారం జిల్ హిజ్జా నెలలో బక్రీద్​ పండుగ వస్తుంది. జిల్​ హిజ్జా నెల పదో రోజున ఈ బక్రీద్ పండుగ జరుపుకుంటారు. ఒంటె, మేక లేదా గొర్రెను దైవమార్గంలో ఖుర్బానీగా సమర్పించాలి. అలా సమర్పించే జంతువులు అవయవ లోపంలేనివి, ఆరోగ్యకరమైనవి అయి ఉండాలి. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం ఖుర్బానీ  విధిగా ఆచరించాలి. అల్లాహ్ నియమ నిబంధనల ప్రకారం ఖుర్బానీగా కోడిపుంజును ఇవ్వకూడదు. ఐదేళ్ల వయసు పై బడిన ఒంటె, రెండేళ్లు పైబడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలివ్వాలి.  ఖుర్భాని చేసే వ్యక్తి వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు.


ఈద్ ఉల్ ఆజ్హా (బక్రీద్)  ప్రార్థనలు ఈద్గాహ్​లో ముగిసిన తర్వాత ఇండ్లకు వచ్చిన ముస్లింలు ఖుర్బానీ ద్వారా అల్లాహ్ పై విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ జంతు బలిదానాలు చేస్తారు. ఆ మాంసాన్ని మూడింట ఒక వంతు పేదలకు పంచాలి. మిగిలిన రెండు భాగాల్లో ఓ భాగం సొంతానికి, మరో భాగం ఇరుగుపొరుగు వాళ్లకు, బంధువులకు పంపిణీ చేస్తారు. ఖుర్బానీ మాంసాన్ని ఇతర మతాల వారికి కూడా పంచుతారు. ఇలా చేయడం ద్వారా మానవులంతా ఒకటేనన్న భావన కలుగుతుంది..

హజ్​లో భాగంగా...

హజ్ చేసే యాత్రికులు సౌదీ అరేబియాలోని జెద్దా నగరానికి  చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సులో మక్కాకు వెళ్తారు. మక్కాకు 8 కిలోమీటర్ల బయట ఉండే ‘మికాత్’ నుంచి హజ్ యాత్ర మొదలవుతుంది. మక్కాలోకి ప్రవేశించే ముందు శరీరాన్ని శుభ్రపరచుకుని, తెల్లని దుస్తులను కట్టుకుంటారు. దాన్నే ‘అహ్రాం’ అంటారు. మహిళలు అహ్రాం ధరించాల్సిన అవసరం లేదు. తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించి, తలకు హిజాబ్ చుట్టుకుంటే సరిపోతుంది. మక్కాకు చేరుకున్న తరువాత ముస్లింలు చేసే తొలి పని ‘ఉమ్రా’. ఇదొక ఆధ్యాత్మిక యాత్ర. ఏడాదిలో ఎప్పుడైనా ఇది చేయొచ్చు. తప్పనిసరి కాకపోయినా హజ్​లో భాగంగా ఉమ్రాను ముస్లింలు చేస్తుంటారు. కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దాన్ని ముట్టుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి ఉమ్రాలో భాగం. 

ఇస్లామిక్ నెల జిల్ హిజ్జా 8వ రోజున హజ్ ప్రారంభమవుతుంది. 8న హజ్ చేయడానికి వెళ్లిన వారు  (హజీలు) మక్కాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనా పట్టణానికి వెళ్తారు. 8న రాత్రి మీనాలోనే ఉండి, మరుసటి రోజు అంటే 9వ రోజు ఉదయం అరాఫత్ మైదానం చేరుకుంటారు. తాము చేసిన పాపాలను క్షమించమని అరాఫత్ మైదానంలో నిలబడి అల్లాను వేడుకుంటారు. 9వ రోజు సాయంత్రానికి ముగ్డలిఫాకు హజీలు చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు.10 వ రోజు పొద్దున తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్​ను రాళ్లతో కొట్టడాన్ని ‘జమారత్’ అంటారు. మీనాకు కొద్ది దూరంలో ఉండే  జమ్రా పిల్లర్లను హజీలు రాళ్లతో కొడతారు. 

అనంతరం మీనా చేరుకొని మేక లేదా గొర్రెను ఖుర్బానీ ఇస్తారు. ఆ తరువాత మగవాళ్లు గుండు చేయించుకుంటారు. ఆడవాళ్లు కొంత జుట్టును సమర్పిస్తారు. జమారత్ తరువాత హజీలు మక్కాకు వస్తారు. కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే ‘తవాఫ్’ అంటారు. జిల్- హిజ్జా10 వ రోజున ముస్లింలు ఈద్ ఉల్ అజ్హా (బక్రీద్) జరుపుకుంటారు. తరువాత మీనాకు వెళ్లి అక్కడ రెండు రోజులుంటారు. జిల్ -హిజ్జా 12వ రోజున చివరిసారి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రార్థిస్తారు.  దీన్నే తవాఫే ఆల్విదా అంటారు.  నమాజ్, రోజా, జకాత్, హజ్ మొదలైన పనులన్నింటిని ముస్లింలంతా పాటించాల్సిందే. మతపరమైన బాధ్యతలు, కర్తవ్యాల విషయంలో మహిళలకు ఎలాంటి మినహాయింపు లేదు. 

ప్రపంచం నలుమూలలనుంచి ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న ‘కాబా’ గృహాన్ని దర్శించుకునేందుకు వస్తారు. నమాజ్, రోజా, జకాత్, హజ్ మొదలైన పనులన్నింటిని ముస్లింలంతా పాటించాల్సిందే. మతపరమైన బాధ్యతలు, కర్తవ్యాల విషయంలో మహిళలకు ఎలాంటి మినహాయింపు లేదు. ప్రపంచం నలుమూలలనుంచి ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న ‘కాబా’ గృహాన్ని దర్శించుకునేందుకు వస్తారు.
- మొహమ్మద్ షౌకత్ అలీ, మెట్​పల్లి, వెలుగు