చదువుల తల్లే కాదండోయ్.. చదువుల స్వామి కూడా ఉన్నాడు!

చదువుల తల్లే కాదండోయ్.. చదువుల స్వామి కూడా ఉన్నాడు!

చదువు పేరు వినగానే మన మనసులో మదిలే దేవత సరస్వతి.తెల్ల చీరతో దర్శనమిస్తుంది.అంతే కాదు వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం.వీటన్నింటికీ అధి దేవతగా సరస్వతీ దేవిని పూజిస్తారు.కానీ చదువుల తల్లే కాక చదువులు స్వామి కూడా ఉన్నాడు.ఆయనెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చదువుల తల్లి సరస్వతీ దేవి అయితే...  విద్యలో రాణించాలంటే హయగ్రీవుని అనుగ్రహం ఉండాటల.  అసలు విద్యకు.. హయగ్రీవ స్వామి గల సంబంధం ఏమిటి... అసలు హయగ్రీవుని చరిత్ర ఏమిటి.. విష్ణుమూర్తి హయగ్రీవుని అవతారం దాల్చడానికి కారణమేమిటి...

విద్య యశస్సు. విద్య సకలాన్ని ప్రసాదిస్తుంది. విద్య ఉంటే ఏలాగైనా బతుకవచ్చు.   విద్య అంటే కేవలం  ప్రస్తుతం మనం చదువుకుంటున్న స్కూల్ విద్య మాత్రమే కాదు. అన్ని రకాల విద్యలు. ఈ విద్య రావడానికి హయగ్రీవస్వామిని  ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి.   విద్యను, వివేకాన్ని ఇచ్చే దేవుడు హయగ్రీవుడు అంటుంటారు మన పెద్దలు.మానవ శరీరానికి గుర్రపు తల ఉన్న హయగ్రీవుడిని హయ శీర్షిక అని కూడా అంటుంటారు. ఆయనకు మొత్తం నాలుగు చేతులు ఉంటాయి.అందులో పైరెండు చేతుల్లో శంఖు చక్రాలు ఉండగా...కుడి చేతిలో అక్షర మాల, ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. వైష్ణవ సంప్రదాయంలో హయగ్రీవుడికి ప్రముఖ స్థానముంది.

పురాణాల ప్రకారం...

పూర్వం గుర్రపుతల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు ఆదిశక్తిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని మరేదైనా వరం కోరుకోమని జగన్మాత చెబుతుంది. అప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు.

అలాగే ఆ రాక్షసుడిని అనుగ్రహించి పరాశక్తి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచమని చెప్పాడట.  ఇక హయగ్రీవునితో పోరాడి..విపరీతమైన అలసట కలగడంతో  శివుని సూచన మేరకు ధనుస్సుకు బాణాన్ని సంధించి తలదగ్గర  పెట్టుకొని నిద్రపోయాడు.

మహావిష్ణువును నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారని విష్ణుపురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు.

విష్ణువు తల కోసం బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది.ఈ స్వామిని ఆరాధిస్తే సకల విద్యలు కరతలామాలకం అవుతాయని పురాణాల్లో ఉంది.ఏపీలోని హిందూపురం, మచిలీపట్నాల్లో హయగ్రీవ ఆలయాలు కూడా ఉన్నాయి