నిఘా నేత్రం.. నిరుపయోగం.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు

నిఘా నేత్రం.. నిరుపయోగం.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు
  • ఓవర్ స్పీడ్ లో అమాయకులను గుద్ది పారిపోతున్న వాహనాలు
  • సీసీ కెమెరాలున్నా పని చేయక సమస్యలు
  • హిట్ అండ్ రన్ కేసుల్లో తప్పించుకుంటున్న దుండగులు

హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గొల్లపల్లికి చెందిన టేకుమట్ల సమ్మయ్య గొర్లు మేపుకునేందుకు మందతో సిద్దిపేటకు వెళ్లి వస్తుండగా, అక్టోబర్ 22న భీమదేవరపల్లి మండలం ముల్కనూరు పీఎస్ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమ్మయ్య తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సిద్దిపేట-ఎల్కతుర్తి హైవేపైనే ఈ యాక్సిడెంట్ జరిగినప్పటికీ రోడ్డుపై ఉన్న ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయక పోలీసులు ఇంతవరకు నిందితులను గుర్తించలేదు. సమ్మయ్యను ఢీకొట్టిన కారు హుస్నాబాద్ వైపు వెళ్లగా, బాధిత కుటుంబ సభ్యులే దారి పొడవునా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించే పనిలో పడ్డారు. అయినా ఇప్పటివరకు దుండగులు దొరక్కపోవడం గమనార్హం.

మే 18న వరంగల్ రంగశాయిపేటకు చెందిన బిట్ల సురేశ్ అనే వ్యక్తి బైక్ పై ఇంటికి వెళ్తుండగా, మిల్స్ కాలనీ పీఎస్​ ఎదుట ఓ ఆటోను అతడి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు మిల్స్ కాలనీ పీఎస్ లో ఫిర్యాదు చేసినా, పోలీసులు ఇంతవరకు ఆటోను గుర్తించలేదు. సీసీ కెమెరాలు పని చేయడం లేదని చెప్పి, ఆ కేసును పక్కన పెట్టేశారు. దీంతో బాధితుడికి ఇబ్బందులు తప్పలేదు. 

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో హిట్ అండ్ రన్ కేసులు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న అమాయకులను అతివేగంతో యాక్సిడెంట్ చేసి, పారిపోవడం కామనైంది. ఇలాంటి ఘటనల్లో నిందితులను గుర్తించేందుకు ఉపయోగపడాల్సిన సీసీ కెమెరాలు దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. నిర్వహణ లేక చాలాచోట్ల సీసీ కెమెరాలు నిరుపయోగంగా మారగా, యాక్సిడెంట్లు, దొంగతనాలు, ఇతర నేరాలు ఏమైనా జరిగిన సందర్భాల్లో దుండగులను గుర్తించడం కష్టమవుతోంది. దీంతో దుండగులు దొరకడం లేదంటూ పోలీస్ ఆఫీసర్లు ఆ కేసులను వదిలేస్తుండగా, బాధితులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

యాక్సిడెంట్ చేసి పరార్..

దాదాపు 5,771 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ మీదుగా ఎన్​హెచ్-163, 563, 765 డీజీ, 365, వరంగల్ టు నర్సంపేట స్టేట్ హైవే అన్నీ కలిపి సుమారు 225 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. కాగా, కమిషనరేట్ పరిధిలోని రోడ్లపై నిత్యం ఐదు లక్షలకుపైగా వెహికల్స్ రాకపోకలు సాగిస్తుంటాయని పోలీస్ ఆఫీసర్ల అంచనా. ఇంతవరకు బాగానే ఉన్నా, కమిషనరేట్ రోడ్లపై ఏటికేడు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. అందులో హిట్ అండ్ రన్ కేసులు కూడా అధికంగానే ఉంటున్నాయి. 2023 లో మొత్తంగా 1,558 యాక్సిడెంట్లు జరిగి, 499 మంది ప్రాణాలు కోల్పోగా, 2024లో జరిగిన 1,434 ప్రమాదాల్లో 440 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటికే వెయ్యికి పైగా యాక్సిడెంట్లు జరగగా, 380 మంది వరకు మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా జరుగుతున్న యాక్సిడెంట్లలో హిట్ అండ్ రన్ కేసులు వందల సంఖ్యల్లోనే ఉంటుండటం గమనార్హం. 

పనిచేయని కెమెరాలు పారిపోతే అంతే.. 

కమిషనరేట్ పరిధిలో ఇదివరకు కమ్యూనిటీ పోలీసింగ్, నేనుసైతం కార్యక్రమాల ద్వారా పోలీస్ ఆఫీసర్లు 50,563 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్లపై ఉన్న జంక్షన్లు, కీలకమైన క్రాస్ లు, ఇతర ముఖ్యమైన చోట్ల కూడా నిఘా కోసం కెమెరాలు బిగించారు. వాటి మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడంతో అందులో సగం కెమెరాలు నిరుపయోగంగా మారాయి. దీంతో మెయిన్ రోడ్లు, జంక్షన్లలో ఏదైనా ప్రమాదం జరిగినా, నేరం జరిగినా నిందితులను గుర్తించలేని పరిస్థితి. ఫలితంగా నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు తంటాలు పడాల్సివస్తోంది.

లైట్ తీసుకుంటున్న పోలీసులు..

యాక్సిడెంట్లు, ఇతర నేరాలు జరిగిన సందర్భాల్లో విచారణ జరిపి దుండగులను గుర్తించాల్సిన పోలీస్ ఆఫీసర్లు సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ చేతులెత్తేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ యాక్సిడెంట్ కు కారణమైన వెహికల్ తమ పీఎస్ పరిధి దాటిపోతే పక్క స్టేషన్ ద్వారానైనా గుర్తించాల్సింది పోయి ఆ కేసును వదిలేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా హిట్ అండ్ రన్ కేసుల్లో దుండగులు పోలీసులకు చిక్కకపోగా, తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. ఇకనైనా కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలను రిపేర్ చేయించడంతో పాటు హిట్ అండ్ రన్ కేసుల్లో దుండగులను గుర్తించేందుకు పోలీస్ ఆఫీసర్లు తగిన చర్యలు చేపట్టాలని బాధితులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.