ఆర్డర్ చేసినవి కొట్టేసి.. రాళ్లు, పెంకులు డెలివరీ

ఆర్డర్ చేసినవి కొట్టేసి.. రాళ్లు, పెంకులు డెలివరీ
  • పనిచేసే కంపెనీని, కస్టమర్లను మోసం చేస్తున్న కొరియర్ ​బాయ్స్
  • కరీంనగర్ ​జిల్లాలో నలుగురు యువకుల అరెస్టు
  • రూ.9 లక్షల వస్తువులు స్వాధీనం 

సైదాపూర్, వెలుగు: ఆన్​లైన్​ స్టోర్ ఫ్లిప్​కార్ట్​లో ఆర్డర్​చేసిన వస్తువులను కొట్టేసి వాటి ప్లేసులో రాళ్లు, పెంకులు, బండలను డెలివరీ చేస్తున్న కొరియర్​బాయ్స్​నలుగురిని కరీంనగర్​జిల్లా సైదాపూర్​పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్​రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన నీర్ల కల్యాణ్, అనగోని వికాస్, కనుకుంట్ల అనిల్, తూటి వినయ్ హుజూరాబాద్ టౌన్​లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ(ఫ్లిప్​కార్ట్​ ప్రొడక్ట్స్​డెలివరీ చేసే కంపెనీ)లో 3 నెలలుగా కొరియర్​బాయ్స్​గా పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీళ్లు డెలివరీ చేయాల్సిన ప్రొడక్ట్స్​కొట్టేయాలని ప్లాన్​చేశారు. అందుకు యూట్యూబ్​లో వీడియోలు చూసి ప్యాకింగ్​ఎలా ఓపెన్​చేయాలి, తర్వాత తిరిగి ఎలా ప్యాక్​చేయాలో నేర్చుకున్నారు. ప్లాన్​ప్రకారం వీళ్లు డెలివరీకి వెళ్లే రూట్​లోని బంధువులు, స్నేహితులతో విలువైన వస్తువులు ఆర్డర్ చేయించేవారు. వాటిని హుజూరాబాద్ ఫ్లిప్ కార్ట్ హబ్​లో కలెక్ట్ ​చేసుకుని సైదాపూర్​ వెళ్లేవారు. తెలిసిన వారి పేరుతో వచ్చిన ఆర్డర్లను క్యాన్సిల్​ చేయించి వచ్చిన వస్తువులను కొట్టేసి బండరాళ్లు పెట్టి తిరిగి కంపెనీకి రిటర్న్ ​చేసేవారు. బయటి వాళ్లవి అయితే కస్టమర్లు ఫోన్​లిఫ్ట్ ​చేయడం లేదని చెబుతూ విలువైన ప్రొడక్ట్స్​కొట్టేసి తర్వాత వాటి ప్లేసులో రాళ్లు, పెంకులు పెట్టి డెలివరీ చేసేవారు. కొట్టేసిన వాటిని బయట అమ్ముకుని కొన్నిరోజులుగా జాల్సాలు చేస్తున్నారు. 
ఒకే ఏరియాలో లక్షల్లో మాయం
ఒకే ఏరియాలో లక్షల విలువైన వస్తువులు మాయం అవ్వడంతో ఫ్లిప్​కార్ట్ హుజురాబాద్ హబ్ టీం లీడర్​ ముప్పు నవీన్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో నలుగురు యువకులు అడ్డంగా దొరికారు. వారి నుంచి 8 ల్యాప్ టాప్స్, 4 కెమెరాలు, 5 వాచీలు, 5 మొబైల్ ఫోన్స్, 4 ఎయిర్ పాడ్స్, వైర్లెస్ చార్జర్, సోనీ మ్యూజిక్ సిస్టం, 3 జతలు నైక్ షూ, రోడ్​స్టర్ జాకెట్, ఆపిల్ పెన్సిల్ ఇలా రూ.9 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.