చంద్రబాబు టూర్‌లో హైటెన్షన్.. రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధం

చంద్రబాబు టూర్‌లో హైటెన్షన్.. రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధం

తిరుపతి: తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పర్యటనకు అనుమతి లేదని చెప్పడంతో ఆయన మరింత ఆగ్రహానికి గురయ్యారు. అధికారం అండతో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ నిరసన చేపట్టేందుకు చిత్తూరు పర్యటనకు చంద్రబాబు వచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులను నిరసిస్తూ.. ఆందోళన చేపడతానని ప్రకటించారు. ముందుగా చంద్రబాబు పర్యటనకు అనుమతి నిరాకరించిన పోలీసులు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు

తన పర్యటన, నిరసన దీక్షకు పోలీసులు అనుమతి లేదని చెబుతుండడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులోనే కింద బైఠాయించి నిరసనకు దిగారు. రాష్ట్రమంతా అరాచకం సృష్టించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీ పర్యటన ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించేలా ఉందని పోలీసులు చెప్పగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక ఇది రాక్షసత్వమా..?  నేను ఈ జిల్లా కలెక్టర్ను.. ఎస్పీ ని కలుస్తాను..  నన్ను ఎందుకు ఎయిర్ పోర్టులోనే ఆపుతున్నారు.. గౌరవంగా పక్కకు తప్పుకోండి.. అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలను ఇక్కడకే పిలిపిస్తామని పోలీసు అధికారులు చెప్పగా చంద్రబాబు తోసిపుచ్చారు.  ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలకు తెలియాల్సిందేనని.. అందుకోసమే తాను ఈ పర్యటన చేపట్టానని చంద్రబాబు చెప్పారు. నేనేమైనా హత్య చేయడానికి వెళ్తున్నానా..? 14 ఏళ్లు సీఎంగా పనిచేశాను.. గౌరవ ప్రతిపక్ష నేతగా ఉన్నాను..? నన్నే నిర్బంధిస్తారా ? అంటూ చంద్రబాబు పోలీసులతో అసహనం వ్యక్తం చేశారు. మరో వైపు ఎయిర్ పోర్టుకు బయలుదేరిన తెలుగు తమ్ముళ్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. చంద్రబాబు నాయుడుకు తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి వెళ్లిన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడు ఇన్చార్జి జెడి రాజశేఖర్,  ఆర్ సి మునికృష్ణ,  టీఎన్ఎస్ఎఫ్ సమన్వయకర్త రవి నాయుడు,  పవన్ కళ్యాణ్,  వంశీ కృష్ణ యాదవ్,  జనార్ధన్ తదితరులు 30 మంది వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని వాహనాన్ని దారి మళ్లించారు. ఎక్కడి తీసుకెళ్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

చిత్తూరు జిల్లాలో నేతల గృహ నిర్బంధం

జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నాకార్యక్రమానికి అనుమతి నిరాకరించిన  పోలీసులు ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని,  పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా ఆపే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు చెబుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల నిరసనలు

చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసనలకు దిగారు. అన్ని జిల్లాలు.. ముఖ్య పట్టణాలు, నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్లంతా గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శనలు, నిరసన దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు తదితర ముఖ్య నేతల ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు నిరసనలు. చిత్తూరు జిల్లాలో తమ నేతల హౌస్ అరెస్టులపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా..? కిరాతకమైన అటవిక రాజ్యమా ? అని ప్రశ్నించారు. గౌరవ ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు, బాధ్యతలు లేవా అన్నారు. అరెస్టు చేసిన తమ నాయకులు, కార్యకర్తలందరినీ విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. వేలాది మందితో ర్యాలీలు, బహిరంగ సభలు,  కుల సంఘాల సమావేశాలకు అనుమతిస్తున్న వైసీపీ ప్రభుత్వం శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తామంటే ఎందుకు అడ్డుకుంటోందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ పాలనలో కొందరే రిచ్ అవుతున్నరు

ప్రధాని మోడీ పాలన బ్రిటీషోళ్ల కన్నా ఘోరం!

కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?

ఆరు నగరాల్లోనే ఐపీఎల్‌-14.. హైదరాబాద్‌కు దక్కని భాగ్యం