రాష్ట్ర సర్కార్​పై  కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఫైర్​

రాష్ట్ర సర్కార్​పై  కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఫైర్​
  • విమోచనం అంటే వణుకెందుకు.. ఉద్యమ ఆకాంక్షలు ఏమైనయ్​?
  • రాష్ట్ర సర్కార్​పై  కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఫైర్​
  • ఎంఐఎంకు భయపడే ఇన్నాళ్లూ
  • ‘సెప్టెంబర్​ 17’ను గాలికి వదిలేసిన్రు
  • పటేల్​తోనే నిజాం అరాచక పాలన నుంచి విముక్తి కలిగింది
  • కొమురంభీమ్‌‌, రాంజీ గోండు వంటి వీరుల త్యాగాలు మరువలేనివి 
  • రజాకార్ల అకృత్యాలపై దేశమంతా డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని ప్రకటన
  • పరేడ్​ గ్రౌండ్స్​​​లో విమోచన వేడుకలు హాజరైన మహారాష్ట్ర సీఎం షిండే


హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని ఉద్యమ సమయంలో, ఎన్నికల్లో హామీ ఇచ్చినవాళ్లు ఇన్నాళ్లూ ఎందుకు జరపలేదని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా నిలదీశారు. రజాకార్లకు భయపడి, ఓటు బ్యాం కు రాజకీయాల కోసమే వేడుకలు జరిపేందుకు సాహసించలేకపోయారని విమర్శించారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆకాంక్షలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు జరపాలని నిర్ణయించడంతో కొందరు హడావుడి చేస్తున్నారని, అయినా వాళ్లలో రజాకార్లంటే భయం కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. ‘‘మోడీ నిర్ణయం తర్వాత  అందరికీ సెప్టెంబర్​ 17 వేడుకలు జరపాలని యాదికొచ్చింది. సంబురాలు జరుపుతామని హడావుడి చేస్తున్నారు. వాళ్లు జరిపితే మంచిదే.. కానీ, వాళ్లలో ఇంకా భయం పోలేదు. విమోచనం అని పలకడానికి కూడా వణికిపోతున్నారు. వాళ్ల తీరు అమరుల అమరత్వాన్ని అవమానించేలా ఉంది. వాళ్లకు నేనొక్కటే చెప్పదలచుకున్నాను.. మీ గుండెల్లో నుంచి భయాన్ని తీసిపారేయండి. ఈ దేశంలో రజాకార్లకు కాలం చెల్లిపోయిందనే విషయం గుర్తుంచుకోండి” అని అన్నారు. శనివారం సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్స్‌‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విమోచన దినోత్సవానికి అమిత్​ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

జాతీయ జెండాను ఆవిష్కరించి, సర్దార్‌‌‌‌  వల్లభాయ్​ పటేల్‌‌‌‌ విగ్రహం వద్ద అమిత్​ షా నివాళులర్పించారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే, కర్నాటక మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్​ షా మాట్లాడుతూ.. నిజాం రాచరిక పాలన నుంచి, రజాకార్ల అరాచకాల నుంచి  హైదరాబాద్‌‌‌‌ సంస్థానానికి విముక్తి లభించి  75 ఏండ్లవుతున్నా ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సాహసించలేకపోయాయని అన్నారు.  ఎవరు అధికారికంగా నిర్వహించినా, నిర్వహించకపోయినా తాము మాత్రం నిర్వహించి తీరుతామని అమిత్​ షా స్పష్టం చేశారు. 

 పటేల్‌‌‌‌ కృషితో స్వేచ్ఛావాయువులు
‘‘1947 ఆగస్టు 15న దేశ ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాల్లో ఉంటే.. హైదరాబాద్​ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడ, కర్నాటక ప్రజలు మాత్రం నిజాం పాలనలో మగ్గాల్సి వచ్చింది. సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ పోలీస్​ యాక్షన్​తో నిజాం సేనలను, రజాకార్లను తరిమికొట్టి 1948 సెప్టెంబర్​ 17న ఈ ప్రాంతానికి విముక్తి కల్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసేందుకు ఇంకా అనేక ఏండ్లు పట్టేది” అని అమిత్​ షా అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన ఎందరో వీరులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాశారని.. కొమురంభీమ్‌‌‌‌, రాంజీ గోండు, స్వామీ రామనంద తీర్థ,  చెన్నారెడ్డి,  నర్సింహారావు, విద్యాధర్‌‌‌‌, కేశవరావు కోరఠ్కర్‌‌‌‌ తదితరుల పోరాటం మరిచిపోలేదని ఆయన అన్నారు. ఆర్యసమాజ్‌‌‌‌, హిందూ మహాసభ,  భాగ్యనగర్‌‌‌‌ సత్యాగ్రహ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయన్నారు. 

రజాకార్ల అకృత్యాలపై డాక్యుమెంటరీని దేశమంతా ప్రదర్శిస్తాం
హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అకృత్యాలపై డాక్యుమెంటరీని దేశం నలుమూలలా ప్రదర్శిస్తామని అమిత్​ షా తెలిపారు. ‘‘హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలపకుంటే గాంధీ కలలు కన్న స్వతంత్ర భారత దేశం కల నెరవేరేది కాదు. రజాకార్లు అనే క రూల్స్​తో జనాన్ని పీడించారు. హిందువులపై అకృత్యాలు జరిగాయి. ఉర్దూ అధికారిక భాష చేసి, తెలుగు, కన్నడ, మరాఠి భాషలపై, ప్రజల సంస్కృ తిపై ఆంక్షలు విధించారు. పర్భనీలో జరిగిన సజీ వ దహనాలు,  బీదర్​లో మహిళలపై జరిగిన అకృత్యాలు, తెలంగాణలోని గుండ్రాంపల్లి, భైరాన్​పల్లిలో జరిగిన అరాచకాలు మానని గాయాలు. బైరాన్​పల్లిలో జలియన్​వాలా బాగ్​ లాంటి సంఘటనలు జరిగాయి” అని గుర్తుచేశారు. హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అకృత్యాలు, పోరాటాలపై  యూనివర్సిటీల్లో రిసెర్చ్‌‌‌‌ జరగాలి.  డాక్యుమెంటరీలను పాత హైదరాబాద్‌‌‌‌లోనే కాదు దేశమంతా ప్రదర్శించి దేశభక్తిని పెంపొందించాలి. హైదరాబాద్‌‌‌‌ విమోచన దినోత్సవాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇవాల్టీ రోజును మేము ఎన్నటికీ మరిచిపోము.. మోడీ సారథ్యంలో దేశం పురోగమిస్తున్నది. మహారాష్ట్ర, కర్నాటకతో పాటు నా ప్రియతమ తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు” అని అమిత్​ షా అన్నారు. హైదరాబాద్‌‌‌‌ సంస్థానంలో విమోచన దినోత్సవ వేడుకలను మొదటి సారి ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నానని, విజయసంకల్పంతో ‘భారత్‌‌‌‌ మాతాకీ జై’ నినాదాలు కాశ్మీర్‌‌‌‌ నుంచి  కన్యాకుమారి వరకు కచ్‌‌‌‌ నుంచి కామాఖ్య వరకు మొత్తం దేశమంతా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వేడుకలకు హోంశాఖ అధికారులు అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ బల్లా, తపన్‌‌‌‌ డేకా, ఉమ నండూరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్‌‌‌‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​  తరుణ్‌‌‌‌చుగ్‌‌‌‌, ఎంపీలు లక్ష్మణ్‌‌‌‌,  ధర్మపురి అర్వింద్‌‌‌‌,  సోయం బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌‌‌‌, రఘునందన్‌‌‌‌రావు,  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌ వెంకటస్వామి, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పరేడ్​లో కళాకారులు కవాతు ఆకట్టుకుంది. 

ప్రజలను రజాకార్లు హింసించారు: శ్రీరాములు
హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రాంతాలపై రజాకార్లు అనేక అకృత్యాలకు పాల్పడ్డారని కర్నాటక మంత్రి శ్రీరాములు తెలిపారు. నిజాం సైన్యం, రజాకార్లు   ప్రజలపై కర్కషంగా వ్యవహరించారని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి దారుణంగా హింసించారని అన్నారు. అప్పటి హోం మంత్రి పటేల్ మిలిటరీ సెప్టెంబర్ 13న బలగాలతో నిజాం సైన్యంపై యుద్ధానికి దిగారని, నాలుగైదురోజుల్లోనే నిజాం సైన్యం తలవంచిందని గుర్తుచేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో వేడుకలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు తెలంగాణలో నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.  


దేశం ముక్కలు కాకుండా పటేల్‌‌‌‌ కృషి: ఏక్ నాథ్
మహారాష్ట్రలో మరాఠ్వాడ ముక్తి దినోత్సవ్ పేరిట విమోచన వేడుక నిర్వహిస్తున్నామని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు.  నిజాం అరాచకాల నుంచి ప్రజలకు పటేల్​ విముక్తి కల్పించారని, దేశం ముక్కలు కాకుండా కృషి చేశారని చెప్పారు.ఎందరో మహానుభావులు నాడు ఉద్యమిం చారని, 75ఏండ్ల తర్వాత ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 


అమరవీరులకు సెల్యూట్​: కిషన్​రెడ్డి
అభినవ సర్దార్‌‌‌‌ పటేల్‌‌‌‌ అమిత్ షా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘1948 సెప్టెంబర్ 17న ఆనాటి హోం శాఖ మంత్రి సర్దార్‌‌‌‌ వల్లభాయ్​ పటేల్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  75 ఇండ్లకు ఇప్పుడు హోంమంత్రి  అమిత్ షా మళ్లీ ఈ గడ్డపై సెప్టెంబర్‌‌‌‌ 17న అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  75 ఏండ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూసిన రోజు ఇది”అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. అమరులకు సెల్యూట్​ చేస్తున్నానని అన్నారు.

దివ్యాంగులకు ఎలక్ట్రికల్​ రిక్షా సైకిళ్ల పంపిణీ
ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా శనివారం అటల్  బిహారి వాజ్ పేయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ బ్యాటరీ రిక్షా సైకిళ్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్ర మాలను చేపడుతున్నామని చెప్పారు.  
  
ఈటల ఇంటికి వెళ్లి పరామర్శ
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం శామీర్ పేటలోని ఈటల ఇంటికి అమిత్ షా వెళ్లి పరామర్శించారు.  మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈటలతో  అమిత్ షా ప్రత్యే కంగా 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. 

అమిత్‌‌‌‌షాతో గోపీచంద్‌‌‌‌ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో ప్రముఖ క్రీడాకారుడు, బ్యాండ్మింటన్‌‌‌‌ కోచ్‌‌‌‌ పుల్లెల గోపీచంద్‌‌‌‌ భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం హరిత ప్లాజా హోటల్‌‌‌‌లో అమి త్‌‌‌‌షాను గోపీచంద్‌‌‌‌ మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడారంగం అభివృద్ధిపైనే మాట్లాడానని గోపీ చంద్​ తెలిపారు.