
- తాకరాని చోట తాకుతున్నడు
- కీచక హెచ్ఎంను చితకబాదిన తల్లిదండ్రులు
- వైరా మండలం కేజీ సిరిపురంలో ఘటన
వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంలోని జిల్లా ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పిల్లల తల్లిదండ్రులు అతడిని చితకబాదారు. హెచ్ఎం సలోది రామారావు చాలాకాలంగా స్టూడెంట్స్‌తో పాటు, మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల కింద పిల్లలందరినీ గాంధీ సినిమాకు తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతడు తాగిన కూల్‌డ్రింక్‌ను తాగిస్తున్నాడని కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో సోమవారం రామారావు తన కారులో స్కూల్‌కు వస్తుండగా సెంటర్లో తల్లిదండ్రులు ఆపారు.
పిల్లలతో తప్పుగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని నిలదీయగా, నీళ్లు నమిలాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. దీంతో అతడు దగ్గర్లోని సర్పంచ్ఇంటికి పారిపోయి దాక్కున్నాడు. సర్పంచ్జనాలను సముదాయించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి రక్షణతో వాహనంలో ఎక్కించారు. అయినా వినని తల్లిదండ్రులు వాహనం నుంచి బయటకు ఈడ్చి కొట్టారు. పోలీసులు వారికి సర్ధి చెప్పి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. రామారావు ఇంతకుముందు వైరా మండల ఎంఈఓగా పని చేశాడు. అక్కడ మహిళా టీచర్లతో అసభ్యంగా ప్రవర్తించగా తల్లాడ హెచ్ఎంగా పంపించారు. ఏడాదిన్నర కింద జరిగిన బదిలీల్లో వైరాకు వచ్చాడు.