గ్రీన్ఫీల్డ్ రోడ్లకు వేగంగా భూసేకరణ..హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ

గ్రీన్ఫీల్డ్ రోడ్లకు వేగంగా భూసేకరణ..హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ
  •     మొదటి విడతలో ఇప్పటికే రావిర్యాల-ఆమన్​గల్​పనులు షురూ  
  •     రెండో విడత బుద్వేల్​-రోస్గి వరకు..
  •     వీటితోపాటు మరో 14 గ్రీన్​ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదన

హైదరాబాద్​సిటీ, వెలుగు:  సమగ్ర మొబిలిటీ ప్లాన్(సీఎంపీ)లో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య రోడ్లను విస్తరించేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ ను కలుపుతూ16 ప్రాంతాల్లో గ్రీన్​ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఇందులో రావిర్యాల నుంచి ఆమన్ గల్ వరకు 41.50 కి.మీ రోడ్డు పనులను 4,621 కోట్లతో ప్రారంభించారు. తాజాగా, మరో గ్రీన్​ఫీల్డ్ రోడ్ ను బుద్వేల్ నుంచి కోస్గి వరకు 81 కి.మీ. రోడ్డు నిర్మించాలని ప్రపోజల్స్​రెడీ చేశారు. దీని కోసం ఆయా మార్గాల్లో భూసేకరణకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రెండు రోడ్లతో పాటు మరో 14 గ్రీన్ ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. 

తెలంగాణ రైజింగ్​లో భాగంగా..

తెలంగాణ రైజింగ్–2047 లో భాగంగా ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా గ్రీన్​ఫీల్డ్​ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రతిపాదిత ఫ్యూచర్​సిటీ అభివృద్ధితో పాటు ట్రిపుల్​ఆర్​వరకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వినోద కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 

ఈ రోడ్లన్నీ 300 ఫీట్లతో నిర్మించనున్నారు.  గ్రీన్​ఫీల్డ్ ​రోడ్లు నిర్మించాలంటే పెద్దయెత్తున భూ సేకరణ అవసరం అవుతుంది. అందుకే, హైదరాబాద్​గ్రోత్​కారిడార్ లిమిటెడ్​(హెచ్ జీసీఎల్)​ అధికారులు రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్​ కూడా జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ట్రిపుల్​ఆర్​ను కలుపుతూ ఓఆర్ఆర్​ఎగ్జిట్​పాయింట్ల నుంచి గ్రీన్​ఫీల్డ్​ రోడ్లను నిర్మించనున్నారు. 

ఓఆర్​ఆర్​కు 22 ఎగ్జిట్​ పాయింట్లున్నాయి. ఇందులో 16 పాయింట్ల నుంచి రోడ్లు వేస్తారు. మొదటగా ఓఆర్ఆర్​13 నంబర్​ఎగ్జిట్​ పాయింట్​ రావిర్యాల నుంచి ఆమన్​గల్​వరకూ రోడ్డు నిర్మిస్తున్నారు. ఫ్యూచర్​సిటీ మీదుగా కొంగర కుర్ధు నుంచి కొంగర కలాన్​, అక్కడి నుంచి మీర్​ఖాన్​పేట, ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్​, ముద్విన్​, ఆమన్​గల్​ మీదుగా ఆకు తోటపల్లి వరకూ ట్రిపుల్​ఆర్​ను కలుపుతూ రోడ్డు వేయనున్నారు.  

బుద్వేల్​ -కోస్గి మరో గ్రీన్​ఫీల్డ్..

గ్రీన్​ఫీల్డ్​రోడ్ల నిర్మాణానికి అవసరమైన వందల ఎకరాల భూములను సేకరించడం పెద్ద టాస్కే అని, దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు హెచ్​జీసీఎల్​అధికారి ఒకరు తెలిపారు. తాజాగా రెండో గ్రీన్​ఫీల్డ్​రోడ్డును 81 కి.మీ. మేర నిర్మించనున్నారు. మొదట కొత్వాల్​గూడ నుంచి పరిగి వరకూ 55 కి.మీ. మేరకు ఈ రోడ్డును వేయాలని అనుకున్నా..మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతో కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇప్పటికే ఆయా మార్గాల్లో భూసేకరణకు నోటిఫికేషన్​ జారీ చేశారు. 

ప్రభుత్వ, ఫారెస్ట్​ భూములు సేకరించడం ఈజీ అని, కానీ, పట్టా భూములు సేకరించడం కష్టమైన విషయమని, భూములను కలిగి ఉన్న వారిని ఒప్పించి సేకరించవలసి ఉంటుందంటున్నారు. ట్రిపుల్​ఆర్​పూర్తయ్యే నాటికి మీర్​ఖాన్​పేట నుంచి ఆమన్​గల్​, తోటపల్లి వరకూ రోడ్లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అంతా ఓఆర్ఆర్​, ట్రిపుల్​ఆర్​మధ్యనే ఉండే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలను విస్తరించడాలని అధికారులు ప్లాన్లు రూపొందిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే అన్ని వైపులా ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​వరకూ రోడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయనున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం, 2047 నాటికి 3.5లక్షల ఇండ్లను నిర్మించాలన్న ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. బుద్వేల్​ – కోస్గి మధ్య నిర్మించే గ్రీన్​ఫీల్డ్​ రోడ్​ కు సంబంధించి అధికారులు డీపీఆర్​ సిద్ధం చేస్తున్నారు. పారిశ్రామిక కేంద్రాలకు, లాజిస్టిక్​ హబ్​లు నెలకొల్పే ప్రాంతాలకు గ్రీన్​ఫీల్డ్​ మీదుగా రాకపోకలు సాగించడం తేలికవుతుందని కూడా భావిస్తున్నారు.