మెడిసిన్‌లో మోడీ సర్కార్‌కు నోబెల్ ఇవ్వాలె

మెడిసిన్‌లో మోడీ సర్కార్‌కు నోబెల్ ఇవ్వాలె

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. టీకా పంపిణీ విషయంలో కేంద్ర తీరుపై ఆయన భగ్గుమన్నారు. సవరించిన వ్యాక్సిన్ విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజు రికార్డు స్థాయిలో ఉన్న టీకా పంపిణీ.. ఆ తర్వాతి రోజు గణనీయంగా తగ్గడంపై ఫైర్ అయ్యారు. మోడీ ఉంటే ఏదైనా సాధ్యమేనని ఎద్దేవా చేసిన చిదంబరం.. వైద్యరంగంలో కేంద్ర ప్రభుత్వానికి నోబెల్ వస్తుందేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వమే టీకాలను ఉచితంగా అందించేలా రీసెంట్‌గా మార్గదర్శకాలను సవరించారు. ఈ క్రమంలో సోమవారం దేశవ్యాప్తంగా 88 లక్షల టీకాలు వేశారు. అయితే మంగళవారం మాత్రం 54 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌లు ఇచ్చారు. ఈ లెక్కలపై చిదంబరం స్పందించారు. ‘ఆదివారం కూడబెట్టి, సోమవారం టీకా వేసి.. మంగళవారం తిరిగి ఎప్పటిలాగే ఇబ్బందుల్లోకి రావడం. ఇదే వ్యాక్సినేషన్‌లో వరల్డ్ రికార్డ్ వెనుక ఉన్న సీక్రెట్. ఈ ఫీట్‌కు గిన్నిస్ బుక్‌లో పక్కాగా చోటు లభిస్తోంది’ అని ట్విట్టర్ వేదికగా చిదంబరం విమర్శలు చేశారు.