ఆసియా కప్ అండర్ 18 హాకీ సెమీ ఫైనల్.. పాక్ను చిత్తు చేసిన టీమిండియా

ఆసియా కప్ అండర్ 18 హాకీ సెమీ ఫైనల్.. పాక్ను చిత్తు చేసిన టీమిండియా

శుక్రవారం జరిగిన అండర్-18 పురుషుల ఆసియా కప్ 2026 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5-3 తేడాతో ఓడించింది. చివరి క్వార్టర్ వరకు 2-3తో వెనుకబడిన భారత జట్టు.. చివరి నిమిషాల్లో అద్భుతమైన ఆటతో ఫైనల్ పోరులో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. మిడ్‌ఫీల్డ్‌లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి.

దీంతో.. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. భారత ఆటగాడు తమ హాఫ్ నుంచే అద్భుతమైన పరుగుతో దూసుకుపోవడంతో, పాకిస్థాన్ జట్టులోని డిఫెన్స్ (defense) శ్రేణి తీవ్ర ఒత్తిడికి లోనై తప్పు చేసింది. దీంతో.. భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. ఫార్వర్డ్ ఆటగాడు ఆశిష్ తాని పుర్తి (12వ నిమిషంలో) దీనిని గోల్‌గా మలిచి.. భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మొదటి క్వార్టర్ ముగిసేవరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది.

రెండో క్వార్టర్‌లో పాకిస్థాన్ హాకీ టీం దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే.. 16వ నిమిషంలో వారు తమ మొదటి పెనాల్టీ కార్నర్‌ను సాధించారు. అయితే.. పాక్ డ్రాగ్‌ ఫ్లికర్ అహ్మద్ ఉజైర్ కొట్టిన శక్తివంతమైన షాట్‌ను భారత గోల్‌కీపర్ ఆయుష్ రజక్, డిఫెండర్ అన్ష్ బహుత్రా అద్భుతమైన సమన్వయంతో అడ్డుకుని భారత్‌ను డేంజర్ జోన్లో పడకుండా గట్టెక్కించారు. 

టీమిండియాపై పాకిస్థాన్ ఒత్తిడిని కొనసాగించి.. మొత్తానికి 27వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. భారత ఆటగాళ్ల పాస్‌ను మధ్యలోనే అడ్డుకున్న పాక్ ఆటగాడు అదీల్, భారత రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ వెళ్లి అద్భుతమైన ఫీల్డ్ గోల్ కొట్టాడు. దీంతో హాఫ్‌టైమ్ (ద్వితీయార్ధం) ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. 

మూడో క్వార్టర్ ప్రారంభం నుంచే.. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. 35వ నిమిషంలో భారత ఆటగాళ్లు స్పీడ్ స్పీడ్గా పాస్‌లు ఇచ్చుకుంటూ ముందుకు సాగారు. దీనిని చక్కగా వినియోగించుకున్న షారూఖ్ అలీ (35వ నిమిషంలో) బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి భారత్‌కు మళ్లీ ఆధిక్యాన్ని అందించాడు. 

అయితే.. భారత్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే.. అంటే 37వ నిమిషంలో పాకిస్థాన్ ఆటగాడు ముహమ్మద్ ఫర్హాన్ అస్లాం ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచిన పాక్.. 42వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉజైర్ అహ్మద్ ఖురేషి  డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో మ్యాచ్‌లో తొలిసారి పాకిస్థాన్ ఆధిక్యంలోకి వెళ్లగా.. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 2-3 తో వెనుకబడింది.

టోర్నమెంట్‌లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో.. నాలుగో క్వార్టర్‌లో భారత్ కౌంటర్ అటాక్ చేసింది. భారత ఆటగాళ్ల ఒత్తిడి తట్టుకోలేక.. 46వ నిమిషంలో పాక్ ఆటగాడు ముజమ్మిల్ సయీద్ గ్రీన్ కార్డ్ (తాత్కాలిక సస్పెన్షన్) తీసుకోక తప్పలేదు. ఈ సమయంలో.. భారత్‌కు వరుసగా పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. 49వ నిమిషంలో వచ్చిన రెండో పెనాల్టీ కార్నర్‌ను ఆశిష్ తాని పుర్తి సూపర్‌ డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్‌గా మార్చి స్కోరును 3-3 తో సమం చేశాడు.

ఆ తర్వాతి నిమిషాల్లో.. భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుస పెనాల్టీ కార్నర్‌లను సాధించింది. పాక్ డిఫెన్స్ కొన్ని ప్రయత్నాలను అడ్డుకున్నప్పటికీ.. భారత ఫార్వర్డ్ ఆటగాళ్లను ఎక్కువసేపు నిలువరించలేకపోయింది. 53వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను ఆశిష్ అద్భుతమైన గోల్‌గా మలిచి.. తన హాట్రిక్‌ను పూర్తి చేయడమే కాకుండా భారత్‌ను 4-3 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

మ్యాచ్ ముగియడానికి మరో నాలుగు నిమిషాలు ఉందనగా (56వ నిమిషంలో) భారత్‌కు ఇంకో పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని కూడా బౌండరీ లైన్ దాటించిన ఆశిష్ తన వ్యక్తిగత నాల్గో గోల్‌ను నమోదు చేశాడు. దీంతో భారత్ ఆధిక్యం 5-3 కి పెరిగింది. చివరి నిమిషాల్లో టీమిండియా కుర్రాళ్లు ఓర్పుతో ఆడి.. పాకిస్థాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తమ ఆధిక్యాన్ని కాపాడుకుని ఘన విజయం సాధించారు. 

ఈ విజయంతో భారత్ సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ అద్భుత విజయంతో టైటిల్ పోరుకు భారత్ అర్హత సాధించింది. అండర్-18 పురుషుల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో జూన్ 6న మధ్యాహ్నం 3:30 గంటలకు జపాన్‌తో టీమిండియా హాకీ టీం పోటీ పడనుంది.