ర్యాంబో పాత్రలతో మారుమోగేలా

ర్యాంబో పాత్రలతో మారుమోగేలా

భారతీయ ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాల్ని అంతంత మాత్రంగానే చూస్తున్న రోజుల్లో రిలీజైంది రాకీ మూవీ. ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన నటుడు తన యాక్టింగ్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చిన ఫస్ట్ బ్లడీ మూవీలో ర్యాంబో పాత్రలో కనిపించి తన లుక్స్, ఫిజిక్ తో ప్రేక్షకుల్ని ఫిదా చేశాడు. ఆ రెండు సినిమాలకీ చాన్నాళ్ల పాటు సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయంటే ఆయన పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు.  హాలీవుడ్ యాక్టర్ అయినా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరో సిల్వెస్టర్ స్టలోన్. 70వ దశకంలో ఆయన ఓ సెన్సేషన్. యూత్ కు ఇన్ స్పిరేషన్. అమ్మాయిల కలల రాకుమారుడు.

అవమానాలు తట్టుకుని..

1946లో మన్ హట్టన్ లో పుట్టాడు సిల్వెస్టర్‌‌. నిజానికి అతని పుట్టుకే ఒక సంచలనం. డెలివరీ సమయంలో డాక్టర్లు ఫోర్సెప్స్ తప్పుగా ఉపయోగించడంతో ఒక నరం దెబ్బ తింది. ముఖంలో ఎడమ భాగం ప్యారలైజ్ అయ్యింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సిల్వెస్టర్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. తోటి పిల్లలు ఆటపట్టిస్తుంటే తనలో తానే కుమిలిపోయేవాడు. ఆ బాధ నుంచే బయటపడేందుకు బాడీ బిల్డింగ్పై దృష్టిపెట్టాడు. నటనపై ఆసక్తి ఉండటంతో యాక్టర్‌‌ గా నిరూపించుకోవాలని కలలుగన్నాడు. నిజం చేసుకున్నాడు. 

కష్టానికి ఫలితం

మొదట్లో నాటకాల్లో నటించిన సిల్వెస్టర్ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు. పొట్ట నింపుకోవడం కోసం జూ పార్క్ లో సింహాల బోన్లు శుభ్రం చేశాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టినా కొన్నాళ్లకు తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. రాకీ, ర్యాంబో పాత్రలు అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశాయి. సిల్వెస్టర్ రిస్కీ షాట్స్,  అదిరిపోయే స్టంట్స్ చూసి అందరూ నోరెళ్లబెట్టేవారు. ఎంత రిస్కీ యాక్షన్ సీన్స్ అయినా డూప్ లేకుండానే చేసేవాడు. ఎస్కేప్‌ టు విక్టరీ, ది ఎక్స్పాండబుల్‌, రాకీ 4  సినిమా షూటింగ్ లలో అలా రిస్కీ షాట్స్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. 

ఆల్‌ రౌండర్

సిల్వెస్టర్ పూర్తి పేరు మైఖేల్ సిల్వెస్టర్ గార్డెన్జియో స్టలోన్. స్టేజ్‌ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు తన పేరుని మైక్‌ స్టలోన్ అని చెప్పుకునేవాడు. సినిమాల్లోకి వచ్చాక సిల్వెస్టర్ ఇస్టలోన్ అని వేసుకునేవాడు. నటుడిగానే కెరీర్ స్టార్ట్ చేసినా.. కొన్నాళ్లకు తనలోని రైటర్‌‌ బయటకు వచ్చాడు. కథలు రాయడంతో పాటు కొన్ని సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. సిల్వెస్టర్ తన ఫైట్స్ తనే కంపోజ్ చేసుకునేవాడు. ‘రాకీ’ మూవీ సిరీస్‌లో కనిపించే బాక్సింగ్‌ సీన్స్ అన్నీ సిల్వెస్టర్ స్వయంగా కొరియోగ్రఫీ చేసినవే. ‘ప్యారడైజ్ ఆలీ’ నవలని సినిమాగా తెరకెక్కించి దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్‌‌ అవతారమెత్తాడు. కొన్నాళ్లకు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో అడుగుపెట్టాడు. టెలివిజన్ రంగంలోనూ సత్తా చాటాడు. ఇలా ఒకే సమయంలో అన్ని పనులు చేస్తూ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. 

వివాదాలు, విషాదాలు

ప్రతి మనిషిలో మంచీ చెడూ ఉన్నట్టు.. సిల్వెస్టర్‌‌ జీవితంలోనూ విజయాలతో పాటు వివాదాలు, విషాదాలు ఉన్నాయి. వేధింపులు, డ్రగ్స్ కేసులు ఆయనను వెంటాడాయి. తనకెంతో ఇష్టమైన చెల్లెలు క్యాన్సర్‌‌తో చనిపోవడం, కొడుకు హార్ట్ అటాక్‌తో మృతి చెందడం సిల్వెస్టర్ ను మానసికంగా కుంగదీశాయి. అయితే ఆ వివాదాలేవీ అభిమానుల్ని ఆయనకు దూరం చేయలేకపోయాయి. ఇప్పటికీ సిల్వెస్టర్‌‌ అంటే పడి చచ్చివాళ్లు ప్రపంచ నలుమూలలా ఉన్నారు. బాడీ బిల్డింగ్ గురించి, యాక్షన్ మూవీస్‌ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది సిల్వెస్టర్ నే ఎగ్జాంపుల్‌గా చూపిస్తుంటారు.