పిల్లలెక్కడుంటే అక్కడే బడి

పిల్లలెక్కడుంటే అక్కడే బడి

హైదరాబాద్‌‌, వెలుగు: బడికి పిల్లలు పోవడం కాదు..పిల్లల దగ్గరికే బడి రాబోతోంది. బడీడు పిల్లల చెంతకే చదువును తీసుకెళ్లనుంది ప్రభుత్వం . పిల్లలను బడిలో చేర్పించడం, డ్రాపౌట్ల నివారణలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ ఈ చర్యలను ప్రారంభించింది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చే కార్మికుల పిల్లలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తల్లిదండ్రులు పనిచేసే చోటే వర్క్ సైట్​ స్కూల్స్ పేరుతో బడులను ప్రారంభిస్తోంది. అందుకోసం విద్యావాలంటీర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్​, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్​ తదితర జిల్లాలకు వలస తాకిడి ఉంటోంది.

ఎక్కువగా ఇటుక బట్టీలు, ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు, రోడ్ల పనులు, సీజనల్ ఫ్యాక్టరీల్లో పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వలస వస్తున్నారు. తల్లిదండ్రుల వెంటే పిల్లలూ ఆ పనిచోటుకు వెళుతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో వర్క్ సైట్​ స్కూల్స్ ఏర్పాటు చేయాలంటూ డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. 5 నుంచి 15 మంది పిల్లలుంటే ఒక వాలంటీర్ , 16 నుంచి 30 మంది ఉంటే ఇద్దరు వాలంటీర్లను నియమించాల్సిందిగా అధికారులకు ఎస్ ఎస్ ఏ సూచించింది. గతంలో ఒక్కో విద్యావాలంటీర్ కు నెలకు ₹4 వేలు ఇస్తుండేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ₹7 వేలకు పెంచారు. కన్నడ, మరాఠీ, ఒరియా తదితర భాషలకు చెందిన విద్యావాలంటీర్లనూ నియమిస్తారు.

ఏర్పాటు ఇలా..

మండల పరిధిలోని ఇటుక బట్టీలు, ఎక్కువ మంది కార్మికులు పనిచేసే ఇతర వర్క్ సైట్లలో విద్యాశాఖ అధికారులు పర్యటిస్తారు. అక్కడి పిల్లల వివరాలను సేకరిస్తారు. కార్మికులు పనిచేసే చోటుకు దగ్గర్లోనే బడులుం టే పిల్లలను ఆ స్కూళ్లలో చేర్పిస్తారు. దూరంగా ఉన్నాయనుకుంటే అక్కడే తాత్కాలి కంగా ఓ బడిని ఏర్పాటు చేస్తారు. తరగతులు వేరైనా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి చదువు చెబుతారు. వారి వివరాలను సమీపంలోని స్కూళ్లలో నమోదు చేయిస్తారు. వారి కోసం ప్రత్యేకంగా రిజిస్టర్ పెడతారు. వేరే ప్రాంతంలో చదువుతూ ఇక్కడికి వలస వచ్చినవాళ్లు.. తిరిగి వెళ్లేటప్పుడు వారి వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారి వివరాలను పంపుతారు. డ్రాపౌట్లను నివారించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్ ఎస్ ఏ ఏఎస్ పీడీ శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో అవసరమున్న చోట వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.