రాహుల్‌ పౌరసత్వంపై రగడ.. నోటీసులిచ్చిన కేంద్ర హోంశాఖ

రాహుల్‌ పౌరసత్వంపై రగడ.. నోటీసులిచ్చిన కేంద్ర హోంశాఖ

రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. దీంతో స్పందించిన హోంశాఖ రాహుల్ కు మంగళవారం నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాహుల్  పౌరసత్వంపై హోంశాఖ ఇచ్చిన నోటీసులను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమర్థించారు. పార్లమెంట్ సభ్యులు ఏ మంత్రిత్వశాఖకైనా ఫిర్యాదులు చేయవచ్చని, వాటిపై విచారణ జరిపి ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటారని అన్నారు. ఇదేదో పెద్ద విషయం కాదని, రెగ్యులర్ ప్రాసెస్ అని చెప్పారు రాజ్ నాథ్ సింగ్.

రాహుల్ పుట్టింది ఇక్కడే: ప్రియాంక గాంధీ వాద్రా
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై నడుస్తున్న వివాదంపై స్పందించారు ప్రియాంక గాంధీ వాద్రా. రాహుల్ భారతీయుడేనని, దేశమంతా తెలుసని అన్నారు . ఆయన ఇక్కడే పుట్టి, పెరిగిన విషయం ప్రజలంతా చూశారన్నారు. దీనిపై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్: రణ్ దీప్ సూర్జేవాలా
రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్ అని ప్రపంచానికంతా తెలుసు అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా. నిరుద్యోగంపై మోడీ దగ్గర సమాధానం లేదని, వ్యవసాయ సంక్షోభం, బ్లాక్ మనీపై జవాబు చెప్పే పరిస్థితిలో మోడీ లేరని, అందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలపై నోటీసులిస్తూ అందరి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.