రాజస్థానీ హోంగార్డు డ్రగ్స్ దందా

రాజస్థానీ హోంగార్డు డ్రగ్స్ దందా
  • సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చి మరో పెడ్లర్ తో కలిసి సప్లయ్
  • ఇద్దరు నిందితుల అరెస్ట్
  • రూ.10 లక్షల విలువైన 215 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం 

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న రాజస్థాన్ కు చెందిన హోంగార్డుతో పాటు మరో పెడ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 215 గ్రాముల ఎండీఎంఏ, రూ. 8 వేల క్యాష్​ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ సోమవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన  ప్రదీప్ శర్మ(37) హోంగార్డుగా పనిచేస్తూ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు. హోంగార్డు యూనిఫాం వేసుకుని పోలీసులకు అనుమానం రాకుండా ఓపీయం(నల్లమందు)తో పాటు ఎండీఎంఏను హైదరాబాద్ కు తరలిస్తున్నాడు. 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దేవడ గ్రామానికి చెందిన మటమవర్ వీరేందర్(43), మరో పెడ్లర్ నరేశ్ చౌదరి ప్రదీప్ నుంచి డ్రగ్స్ ను కొని సిటీలో అమ్మేవారు. గతేడాది వీరేందర్, నరేశ్ ను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత వీరేందర్ మళ్లీ డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. ప్రదీప్ శర్మ నుంచి ఎండీఎంఏను కొని సిటీలో అమ్ముతున్నాడు. సిటీలో కస్టమర్ల ఆర్డర్లు ఉన్నాయని వీరేందర్ చెప్పడంతో ప్రదీప్ శర్మ ఇటీవల సిటీకి వచ్చాడు. వీరిద్దరూ కలిసి ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో 215 గ్రాముల ఎండీఎంఏను అమ్మేందుకు యత్నించారు. దీని గురించి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వీరేందర్, ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి డ్రగ్స్ కస్టమర్లు, డీలర్ల వివరాలను రాబడుతున్నామని పోలీసులు తెలిపారు.