కారుణ్య నియామకాల కోసం హోంగార్డుల ఎదురుచూపులు

కారుణ్య నియామకాల కోసం హోంగార్డుల ఎదురుచూపులు
  • హోంగార్డులకు భరోసా ఏదీ?
  • హెల్త్ కార్డులు, వీక్లీ ఆఫ్​లు, యూనిఫామ్ అలవెన్స్ లు లేవు
  • మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లకూ అనుమతివ్వని ప్రభుత్వం
  • గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు కలగని మోక్షం
  • నియామకాల కోసం 300 హోంగార్డుల కుటుంబాల ఎదురుచూపులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల జీవితాలకు మాత్రం భరోసా లేకుండా పోయింది. ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాల తర్వాత ప్రభుత్వం కొంత మేర జీతం పెంచినప్పటికీ.. ఆపై వాళ్ల సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు, సెలవులు, వీక్లీ ఆఫ్ లకు నోచుకోవట్లేదు. పని చేసిన రోజుకు జీతమిస్తూ.. లీవ్ పెట్టిన రోజు జీతంలో కోత పెడ్తున్నారు. దురదృష్టవశాత్తు హోంగార్డు చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమూ ఇవ్వట్లేదు. ఆ కుటుంబానికి కనీస ఆర్థిక సాయం కూడా అందట్లేదు.

జీవో ఇచ్చి ఐదేండ్లయినా అమలైతలే..

రాష్ట్రంలో దాదాపు 16 వేల మంది హోంగార్డులు విధుల్లో ఉన్నారు. హోంగార్డులకు ఉమ్మడి ఏపీలో నెలకు రూ.12 వేల జీతం వచ్చేది. తెలంగాణ వచ్చాక జీతాల పెంపు కోసం హోంగార్డులు 2017లో చలో సెక్రటేరియట్ పేరిట భారీ ఆందోళన చేశారు. దీంతో దిగొచ్చిన సర్కార్ హోంగార్డుల జీతాలను రూ.21 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఏడాదికోసారి రూ.1000 ఇంక్రిమెంట్ ఇస్తామని 2018లో జీవో ఇచ్చింది. 2021కి వచ్చేసరికి మూడేండ్ల ఇంక్రిమెంట్​ను ప్రభుత్వం 30 శాతం పీఆర్సీతో సరిపెట్టడంతో హోంగార్డులు నిరాశకు లోనయ్యారు. బందోబస్తుకు వెళ్తే టీఏ, డీఏలు చెల్లిస్తామని, కానిస్టేబుల్స్ మాదిరిగా హోంగార్డులకు యూనిఫామ్ అలవెన్స్, డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరులో ప్రయార్టీ అని జీవోలో హామీ ఇచ్చింది. ఐదేండ్లు గడిచినా ఆ జీవో అమలు కావట్లేదు. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డుల మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏండ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.  

కారుణ్య నియామకాల కోసం ఎదురుచూపులు.. 

సర్వీసు కాలాన్ని బట్టి హోంగార్డులకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ సిఫార్సులు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హోంగార్డు చనిపోయినా, రిటైర్ అయినా ఎలాంటి ఆర్థిక సాయం అందట్లేదు. తెలంగాణ వచ్చాక ఇప్పటి వరకు దాదాపు 300 మంది హోంగార్డులు చనిపోయారని అంచనా. 2019 లో కరోనా కాలం నుంచి 2022 నవంబర్ నాటికి అనారోగ్య కారణాలు, రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో 178 మంది హోంగార్డులు చనిపోయారు. వీళ్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. గతంలో తోటి హోంగార్డు చనిపోతే రాష్ట్రంలోని హోంగార్డులంతా కలిసి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చేవారు. కొన్నాళ్లుగా ఇలా ఒక రోజు జీతాన్ని కట్ చేసి ఇచ్చే వెసులుబాటును కూడా పోలీస్ శాఖ తీసేయడంపై హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగూ సాయం చేయట్లేదని, తమ జీతాల్లో నుంచి ఇస్తే సర్కార్ కు అభ్యంతరమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్నది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన హోంగార్డు శివ భార్య పవిత్ర. వారికి ఒక కూతురు ఉంది. శివ అప్పట్లో భిక్కనూరు సీఐ జీపు డ్రైవర్ గా పనిచేశాడు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆయన ‘‘నేను చావడానికి కారణం ఆర్థిక పరిస్థితులే. తెలంగాణ వచ్చాక మా బతుకులు మారతాయ నుకున్నం. సీఎం కేసీఆర్​ అసెంబ్లీ సమావేశంలో చెప్పినట్లు మమ్మల్ని పర్మినెంట్ చేయలేదు. ఇక మా బతుకులు ఇంతే అని బతుకు చాలిస్తున్నా’’ అని సూసైడ్ నోట్ రాసి 2017 సెప్టెంబర్ 18న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో అధికార, ప్రతిపక్ష నేతలంతా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. శివ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని అప్పటి ఎస్పీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఆ కుటుంబానికి పరిహారంగానీ, కారుణ్య నియామకం కింద జాబ్ గానీ ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.