హోంగార్డులను పర్మినెంట్ చేయాలె : జీవన్​ రెడ్డి

హోంగార్డులను పర్మినెంట్ చేయాలె : జీవన్​ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు :  హోంగార్డులను రెగ్యులైజ్​ చేయాలని, వారికి టైంకు జీతాలివ్వాలని సీఎం కేసీఆర్​ను కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్​ చేశారు. ఆత్మాహుతికి యత్నించిన హోంగార్డు రవీందర్​ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. బుధవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. ఏండ్లతరబడి హోంగార్డులుగా సేవలందించి సర్వీసు కాలంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పించడం లేదన్నారు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 

హెూంగార్డులు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కానిస్టేబుళ్లు పొందుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవీ కూడా హెూంగార్డులకు అందడంలేదని పేర్కొన్నారు. రిటైర్​ అయిన తర్వాత వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎలాంటి ప్రోత్సాహకాలూ ఇవ్వకపోగా టైంకు జీతాలు కూడా ఇవ్వకపోతుండడంతో హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్​ బ్యాంకులో తీసుకున్న లోన్​ను చెల్లించలేకపోయాడు. దీంతో ఆవేదన చెంది ఆత్మాహుతికి యత్నించినట్లు తెలిపారు. హోంగార్డులను పర్మినెంట్​ చేస్తామన్న సీఎం కేసీఆర్​ తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్​ చేశారు.