- హోంగార్డ్ రైజింగ్ డే వేడుకల్లో ఎస్పీలు
ఆదిలాబాద్/ నిర్మల్/ఆసిఫాబాద్, వెలుగు: పోలీసులతో సమానంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం 63వ హోంగార్డ్ రైజింగ్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో హోంగార్డు భూమన్న కమాండర్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం హోంగార్డు సిబ్బందికి దినసరి వేతనం రూ. 920 నుంచి రూ.1000కి పెంచారని గుర్తుచేశారు. మొట్టమొదటిసారిగా జిల్లా హోంగార్డు సిబ్బందికి ఆరోగ్య భద్రత కార్డులు అందజేశామన్నారు. ప్రభుత్వం ప్రమాద బీమా రూ.5 లక్షలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఆర్డీ డీఎస్పీ ఇంద్రవర్ధన్, ఆర్ఐ డీ వెంకటి తదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు ప్రశంసనీయం
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ లాంటి అనేక కీలక రంగాల్లో హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. జిల్లా సాయుధ పోలీస్ కార్యాలయంలో హోంగార్డుల రైజింగ్ డే వేడుకలు నిర్వహించారు.
హోంగార్డు కుటుంబాలకు చెందిన 20 మంది విద్యార్థులకు, సేవలో ఉండగానే మరణించిన హోంగార్డుల పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెక్కులను దాతల సహకారంతో అందించామన్నారు. అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఎస్పీ రాజేశ్ మీనా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు కీలకమని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా పోలీస్ వందనం స్వీకరించి ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి మొక్కలు నాటారు. అనతరం మాట్లాడుతూ.. ప్రజల భద్రత, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బలగాలకు సహకారం అందించడంలో హోంగార్డులు చూపుతున్న క్రమశిక్షణ, నిబద్ధత మరువలేమని కొనియాడారు.
