ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తం : అమిత్ షా

ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తం : అమిత్ షా

దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ‍ ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవడంతో పాటు పీఎఫ్ఐ ఉగ్రవాద సంస్థను నిషేధించామని చెప్పారు. హైదబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 74 వ బ్యాచ్‌  ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరై ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి ఎన్నికవుతారని కానీ  ఐపీఎస్‌లకు 30  నుంచి 35ఏళ్ల పాటు అధికారం ఉంటుందన్నారు. ప్రతీ ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళే ఉన్నారని..  రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 

ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అమిత్ షా చెప్పారు. 8ఏళ్ల క్రితం దేశం అంతర్గత ఆందోళనలతో అట్టుడుకిందని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని అమిత్ షా అన్నారు. 7 దశాబ్దాలుగా అంతర్గత భద్రత రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, ఈ పరిస్థితుల్లో 36 వేల మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమస్యలు ఉండేవని..  అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై పని చేశామమన్నారు. అదేవిధంగా 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టామన్న షా.. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.