
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధం వాతావారణం నెలకొంది. ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగినప్పుడు సంసిద్ధతను అంచనా వేయడానికి 2025, మే 7న అన్ని రాష్ట్రాలు భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా వైమానికి దాడులు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.
వైమానికి దాడుల హెచ్చరిక సైరన్ల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రతి స్పందించాలో తెలపాలని.. స్వీయ రక్షణపై పౌరులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. 1971 పాక్ యుద్ధం తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించడం ఇదే ఫస్ట్ టైమ్. మళ్లీ భారత్ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టడంతో పాక్‌తో వార్ షూరు కాబోతుందని కేంద్రం సంకేతాలు ఇచ్చేసిందని ఊహాగానాలు మొదలయ్యాయి.
►ALSO READ | మీ ఇష్టం.. భారత్‌తో యుద్ధం చేస్తే మీకే నష్టం: పాక్‌కు మూడీస్ రేటింగ్స్ సంస్థ హెచ్చరిక
కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు కురిపించిన తుటాల వర్షానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. ఈ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉన్నట్లు గుర్తించిన భారత్.. దాయాది దేశంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెంచుకుని.. పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాక్‌ను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.