
- జులై–సెప్టెంబర్ క్వార్టర్లో 22 శాతం గ్రోత్
- 7 సిటీలలో ఇదే ట్రెండ్
- హైదరాబాద్‌లో 34 శాతం అప్
- ఒక్క చెన్నైలో రివర్స్ గేర్
న్యూఢిల్లీ: దేశంలోని 8 టాప్ సిటీలలో ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్ క్వార్టర్లో 22 శాతం పెరిగినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. ఇదే క్వార్టర్లో కొత్త సప్లయ్ 17 శాతం ఎగసినట్లు రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌టైగర్.కామ్ రిపోర్టు తెలిపింది. జులై–సెప్టెంబర్ క్వార్టర్లో 1,01,220 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయినట్లు ఈ రిపోర్టు పేర్కొంది. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లో ఈ అమ్మకాలు 83,220 యూనిట్లు మాత్రమే. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూఐరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్ సిటీలలోని అమ్మకాల డేటాను ప్రాప్‌టైగర్.కామ్ విడుదల చేసింది. ఒక్క చెన్నై సిటీ మినహా మిగిలిన ఏడు సిటీలలోనూ ఇండ్ల అమ్మకాలు గ్రోత్ రికార్డు చేశాయని ఈ రిపోర్టు వివరించింది. మొత్తం ఇండ్ల అమ్మకాలలో సగానికిపైగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె సిటీలలోనే జరిగినట్లు తెలిపింది.
మరోవైపు కొత్త ప్రాజెక్టు లాంఛెస్ కూడా ఈ ఏడాది మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగాయని, 1,23,080 కొత్త ఇండ్ల నిర్మాణపు ప్రాజెక్టులను కంపెనీలు ప్రకటించాయని ప్రాప్‌టైగర్.కామ్ రిపోర్టు వెల్లడించింది.
అంతకు ముందు ఏడాది అంటే 2022 మూడో క్వార్టర్లో కొత్త లాంఛెస్ 1,04,820 యూనిట్లేనని పేర్కొంది. టాప్ 8 సిటీలలో హౌసింగ్ మార్కెట్లు జోరందుకుంటున్నాయని, కన్జూమర్ సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉండటమే దీనికి కారణమని ప్రాప్‌టైగర్.కామ్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ చెప్పారు. పెంటప్ డిమాండ్‌తోపాటు, ప్రజల ఆదాయాలలో పెరుగుదల, వడ్డీ రేట్లు నిలకడగా ఉండటం, ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగడంతో ఇండ్ల అమ్మకాల మొమెంటమ్ ఊపందుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్ 2023 క్వార్టర్లో అహ్మదాబాద్‌లో 31 శాతం, బెంగళూరులో 60 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 44 శాతం, కోల్‌కతాలో 43 శాతం, హైదరాబాద్‌లో 34 శాతం, ముంబైలో 5 శాతం, పుణెలో 18 శాతం పెరిగినట్లు తెలిపారు. ఈ క్వార్టర్లో చెన్నైలో ఇండ్ల అమ్మకాలు 3,870 యూనిట్లకే పరిమితమైనట్లు వెల్లడించారు.