ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై సమావేశం ముగిసింది. 11 గంటల తర్వాత మొదలైన మీటింగ్ 2 గంటల పాటు జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ లో రెండు రాష్ట్రాల సీఎస్ లు, వివిధ శాఖల అధికారులు భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో విభజన అంశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్, సివిల్ సప్లై శాఖ కార్యదర్శి అనిల్ కుమార్, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ శ్రీధర్, ట్రాన్స్ కో, జెన్ కో ఉమ్మడి ఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ స్పెషల్ కార్యదర్శి సునీల్ శర్మ, రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టెక్స్టైల్స్ కార్యదర్శి బుద్ధా ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ అటెండయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో పాటు వైద్య, విద్యం , పెట్రోలియం, రైల్వే ఇతర కీలక శాఖల అధికారులు మీటింగ్ కు వచ్చారు.
సమావేశం ఎజెండాలో మొత్తం 14 అంశాలను చేర్చింది హోంశాఖ. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు. రెండు రాష్ట్రాలకు చెందిన అంశాల్లో ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 9 10 లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టీఎస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ క్యాష్ క్రెడిట్, 2014 – 15 రైస్ సబ్సిడీ విడుదల అంశాలున్నాయి. ఇక ఏపికి సంబంధించిన విభజన చట్టం అంశాల్లో కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విభజన చట్టం కింద పన్ను రాయితీలు , ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు , పన్ను మదింపులో పొరపాట్ల సవరణ, నూతన విద్యాసంస్థల ఏర్పాటు, కొత్త రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు, రిసోర్స్ గ్యాప్ తదితర అంశాలున్నాయి.
