తెలంగాణలో ఊపందుకున్న హోం ఓటింగ్ కార్యక్రమం..

తెలంగాణలో ఊపందుకున్న హోం ఓటింగ్ కార్యక్రమం..

కరీంనగర్: రాష్ట్రవాప్తంగా హోం ఓటింగ్ కార్యక్రమం ఊపందుకుంది. 80ఏళ్లకు పైబడిన వృద్దులు, 40 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోం ఓటింగ్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 28,057 మంది ఓటర్లను ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా.. అనుమతించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలో ఇంటి నుంచే 838 మంది వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ హోం ఓటింగ్ కార్యక్రమం ఈనెల 27 వరకు సాగనుంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది.. డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. 

కరీంనగర్  జిల్లాలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ (నవంబర్ 23) నిర్వహించిన హోంఓటింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి.ఓటింగ్ విధానంపై ఓటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు కలెక్టర్.

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఈ హోం ఓటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం.. 2023లో జరిగే  తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ,రాజస్థాన్ నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌లో 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు,  40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా బూత్ లెవల్ అధికారులు ఓటరు ఇంటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించింది.