తాగునీటికి ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులు

తాగునీటికి ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులు

హైదరాబాద్, వెలుగు: వేర్వేరు రాష్ట్రాలు, జిల్లాల నుంచి సిటీకి వలసొచ్చిన నిరాశ్రయులు నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇంటి అద్దెలు కట్టే స్థోమత లేక రోడ్లు, నలాల వెంట గుడిసెలు వేసుకొని గ్రేటర్​పరిధిలో చాలా మంది ఉంటున్నారు. ఆయా ఏరియాల్లో బజారు నల్లాలు లేక నీళ్లు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. డైలీ నల్లా ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి నీళ్లు అడుక్కొచ్చుకుంటున్నారు. ఎండా కాలంలో చాలా మంది తమకే నీళ్లు చాలట్లేదంటున్నారని బాధితులు చెబుతున్నారు. దీంతో మంచినీటి కోసం వేరే ప్రాంతాలకు బిందెలతో వెళ్లి తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. కాలనీల్లో రోడ్లకు పక్కన ఉన్న చేతి పంపులు పని చేయడం లేదని, కనీసం వాటిని రిపేర్ చేసినా తమకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. ఇలాంటి వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన ఉన్నా జలమండలి ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు. గ్రేటర్​లోని అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. గతంలో కొన్నిచోట్ల బజారు నల్లాలు ఉండేవని, ఆఫీసర్లే  వాటిని తొలగించారని చెబుతున్నారు. చలివేంద్రాలకు నీటిని ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించిన జలమండలి ఎండీ, తమను పట్టించుకుంటే బాగుంటుందని నిరుపేదలు కోరుతున్నారు ఈ విషయంపై ఆఫీసర్లను అడిగితే తమకు ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో రిపేర్లు చేస్తున్నామని చెబుతున్నారు. 

అన్నిచోట్ల ఇదే సమస్య

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి మొదలుపెడితే మురికివాడల వరకు ఎంతో మంది గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. మెహిదీపట్నం, టోలిచౌకి, సింగాడబస్తీ, ముసారాంబాగ్ ప్రాంతాల్లోనే దాదాపు వెయ్యి మందికిపైగా నిరాశ్రయులు గుడిసెలు వేసుకొని ఉంటూ కూలీ పనులకు వెళ్తున్నారు. సిటీలో నలుగురు, ఐదుగురు ఉండేందుకు చిన్న ఇంటికైనా కనీసం నాలుగైదు వేల అద్దె చెల్లించాలి. అంతకు తక్కువగా లభించాలంటే సిటీ శివారులో రేకుల ఇండ్లు లభిస్తాయి. కానీ అక్కడ ఉంటే కూలీ పనులు లభించకపోవడంతో సిటీలోనే గుడిసెలు వేసుకొని ఉంటున్నామని పలువురు నిరాశ్రయులు చెబుతున్నారు. తమకు నీళ్లు ఒక్కటి అందిచాలని వేడుకుంటున్నారు. కనీసం రోడ్డు పక్కన ఓ నల్లా కనెక్షన్​ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

బల్దియా షెల్టర్ హోమ్స్ ఎందుకు?

వేరే ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన నిరాశ్రయులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాని పలు సందర్భాల్లో మంత్రులు అన్నారు. ఇలాంటి వారి కోసం జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో కొందరే ఉంటున్నారు. ఎవరైనా ఉందామని వెళ్తే కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అనుమతించరు. అసలు గ్రేటర్​లో షెల్టర్ హోమ్ప్ ఉన్నట్లు కనీసం తెలియట్లేదు. దీంతోనే వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన నిరాశ్రయులు రోడ్లు, నాలాల పక్కన గుడిసెలు వేసుకొని ఉంటున్నారు.  

కార్పొరేటర్లు డిమాండ్

రోడ్డు పక్కన నల్లాలు లేక నిరుపేదలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగులో కొందరు కార్పొరేటర్లు చెప్పారు. ప్రత్యేకంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతిమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఇదే అంశంపై మాట్లాడారు. కాలనీల్లో నల్లాలు లేక జనం చాలా ఇబ్బంది పడుతున్నారని, ఎవరైనా చనిపోతే పక్కింటి వాళ్లు నీళ్లు ఇయ్యని పరిస్థితి ఉందన్నారు. పాడైన చేతిపంపులను రిపేర్ చేయడం లేదన్నారు. ఇలా అధికార పార్టీ కార్పొరేటరే ఇలా మాట్లాడారంటే సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మొదట్లో బజారు నల్లా ఉండేది

పదేండ్ల కిందట కర్ణాటకలోని హుమ్నాబాద్ నుంచి సిటీకి వలసొచ్చాం. కూలి పని చేసుకునే తమకి అద్దె చెల్లించే స్థోమత లేక గుడిసెలు వేసుకొని ఉంటున్నం. మొదట్లో ఈ ఏరియాలో బజార్ నల్లా ఉండేది. తర్వాత తొలగించారు. అప్పటి నుంచి డైలీ నల్లా ఉన్న ఒక్కో ఇంటికి వెళ్లి నీళ్లు అడుక్కుంటున్నం. ఎండా కాలంలో వాళ్లకు వచ్చే నీళ్లు చాలక, మాకు లేవంటున్నారు. నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నం. పాడైన చేతి పంపులనైనా మంచిగ చేస్తే బాగుండు.
– లక్ష్మి, టోలిచౌకి

వారంలో 2 - 3 సార్లే స్నానం

తాగునీటి కోసం బిందెలతో వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి అక్కడ కూడా దొరక్క బయట కొంటున్నం. ఇంట్లో అవసరాలకు చాలా కష్టమైతంది. వారానికి రెండు, మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తున్నం. రోడ్డు పక్కన ఒక నల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వందాలాది మంది నీటిని కోసం ఇబ్బంది పడుతున్నారు. కూలీ పనులు చేసిన దానికంటే నీళ్ల కోసమే ఎక్కువ కష్టపడుతున్నం.   
- గోపాల్, ముసారాంబాగ్