
భారతీయ డిజిటల్ నావిగేషన్ మార్కెట్‌లో గూగుల్ మ్యాప్స్ చాలా కాలంగా నంబర్ 1గా ఉంది. అయితే, మ్యాప్‌మైఇండియా (MapmyIndia) అభివృద్ధి చేసిన భారతదేశానికి చెందిన సొంత నావిగేషన్ యాప్ మ్యాప్ల్స్ (Mappls) ఇప్పుడు స్థానిక ప్రత్యామ్నాయంగా (Local Alternative) బాగా ఎదుగుతోంది. గూగుల్ మ్యాప్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ మ్యాప్ల్స్ మాత్రం భారతీయుల కోసం ప్రత్యేకంగా ఇండియాకి తగ్గ ఫీచర్లను అందిస్తోంది.
మ్యాప్ల్స్‌ను నావిగేషన్ యాప్ ఐదు ప్రత్యేక ఫీచర్లు:
1. మ్యాప్ల్స్ పిన్ (Mappls Pin): మ్యాప్ల్స్ లోని గొప్ప ఫీచర్లలో 'మ్యాప్ల్స్ పిన్' ఒకటి. ఇది ఆరు అక్షరాల డిజిటల్ కోడ్. ఈ కోడ్ ఒక చోటును సరిగ్గా తెలియజేస్తుంది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో అడ్రస్ సరిగా ఉండకపోవడం లేదా సగం సగం ఉండడం అనేది ఒక సమస్య. ఈ పిన్ సిస్టం అలంటి సమస్యను పరిష్కరిస్తుందని కంపెనీ చెబుతోంది.
2. టోల్ అండ్ ట్రిప్ కాస్ట్ ఫీచర్ (Toll and Trip Cost Calculator): మ్యాప్ల్స్ కేవలం రూట్ చూపడమే కాకుండా టోల్ ఛార్జీలు, ఇంధన ఖర్చులు అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, డ్రైవర్లకు బాగా ఉపయోగపడుతుంది.
3. 3D జంక్షన్ వ్యూస్ (3D Junction Views): భారతీయ నగరాల్లో ఫ్లైఓవర్లు లేదా హైవేల వద్ద సరైన దారిని గుర్తించడం కష్టం. అయితే, మ్యాప్ల్స్ రియల్ 3D జంక్షన్ వ్యూ అందిస్తుంది. ఇవి లేన్, ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, చుట్టుపక్కల ల్యాండ్‌మార్క్‌లను స్పష్టంగా చూపిస్తాయి. ఈ ఫీచర్ తప్పు దారిలోకి (wrong turn) వెళ్లకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇస్రో (ISRO) సహకారంతో పనిచేయడం వల్ల భారతీయ భూభాగానికి తగ్గట్లుగా హై-ప్రెసిషన్, సాటిలైట్ సపోర్ట్ ఉన్న మ్యాపింగ్ అందిస్తుంది.
4. లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్లు (Live Traffic Signal Timers): మ్యాప్ల్స్ లోని మరో అద్భుతమైన ఫీచర్ లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్ల ఇంటిగ్రేషన్. ఇది ప్రస్తుతం కేవలం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్ రెడ్, గ్రీన్ లైట్ల టైం చూపిస్తుంది. ఈ సమాచారం అంతా AI ద్వారా అందిస్తారు. అలాగే ట్రాఫిక్ తప్పించడానికి వేరే దారులను కూడా సూచిస్తుంది.
5. రోడ్డు అలర్ట్స్ (India-Specific Road Alerts): గ్లోబల్ యాప్‌లు లోకల్ పరిస్థితులను అంతగా పట్టించుకోవని చాలా కాలంగా ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, మ్యాప్ల్స్ మాత్రం భారతీయ రోడ్లపై ఎక్కవగా కనిపించే స్పీడ్ బ్రేకర్లు, గుంతలు, ప్రమాదకరమైన మలుపులు, స్పీడ్ కెమెరాల గురించి ముందుగానే అలర్ట్స్ ఇస్తుంది. ఈ లోకల్ సమాచారం మ్యాప్‌మైఇండియా సంవత్సరాల తరబడి గ్రౌండ్ లెవల్‌లో సేకరించిన డేటా ద్వారా అందిస్తున్నారు.
గూగుల్ మ్యాప్స్ ప్రపంచంలోనే టాప్‌లో ఉన్నప్పటికీ మ్యాప్ల్స్ భారతీయ యూజర్లకు నచ్చే విధంగా కస్టమైజ్ ఆనుభవాన్ని అందిస్తోంది. భారతదేశంలోని రకరకాల రోడ్లపై ప్రయాణించే వారికి మ్యాప్ల్స్ ఒక మంచి, తెలివైన అప్షన్ అవుతుంది.