
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి రహస్య సమాచారం అందించినందుకు మేలో అరెస్టయిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్‌పై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పూణె కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. పూణేలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ల్యాబ్‌లలో కురుల్కర్ ఒకదానికి డైరెక్టర్‌గా ఉన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద మే 3న అరెస్టు అయిన ఆయన.. ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈ కేసులో 18వందల పేజీల చార్జిషీట్‌ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్.. ఏటీఎస్ దాఖలు చేసింది. దాంతో పాటు ఇప్పటివరకు ఈ కేసులో 203 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (PIO)లో పనిచేసిన జారా దాస్‌గుప్తాతో కురుల్కర్ రహస్య సమాచారాన్ని పంచుకున్నారని ఏటీఎస్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఇతర క్లాసిఫైడ్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌లలో భారత క్షిపణి వ్యవస్థల గురించి కూడా కురుల్కర్ ఆమెతో చాట్ చేశారని ఆరోపించింది. ఈ ఛార్జిషీట్ ప్రకారం, కురుల్కర్, జరా దాస్‌గుప్తా వాట్సాప్ చాట్ తో పాటు వాయిస్, వీడియో కాల్‌ల ద్వారా కూడా సంభాషించుకున్నారు.
బ్రిటన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చెప్పుకుంటున్న పాకిస్థానీ ఏజెంట్ దాస్‌గుప్తా.. కురుల్కర్‌కు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపుతూ స్నేహం పెంచుకున్నాడని ఏటీఎస్ తెలిపింది. ఆమె ఐపీ అడ్రస్ ను తనిఖీ చేయగా అది పాకిస్థాన్‌కు చెందినదని తేలినట్టుగా కూడా ఏటీఎస్ ఛార్జిషీట్‌లో నివేదించింది.
కురుల్కర్ తన ఫోన్‌లో మాల్‌వేర్‌తో కూడిన కొన్ని సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నాడని, ఆ సాఫ్ట్‌వేర్ సహాయంతో పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఈ సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందని మహారాష్ట్ర ఏటీఎస్ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
డీఆర్డీవో (DRDO)శాస్త్రవేత్తకు పాకిస్తాన్ గూఢచారికి మధ్య జరిగిన చాట్:
మొదటి చాట్‌లో, కురుల్కర్ జారాతో సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (SAM) గురించి మాట్లాడాడు.
జరా- బేబ్ నేను ఇప్పుడే చూశాను మీరు దానిపై పని చేస్తున్నారా?
కురుల్కర్- అవును, నేను SAMలో కూడా పని చేస్తున్నాను
జరా- అది ఎప్పుడు అయిపోతుంది బేబ్?
కురుల్కర్- రాబోయే కొద్ది వారాల్లో
జరా- మీరు దాన్ని ఆర్మీకి ఇస్తారా, ఎయిర్‌ఫోర్స్‌కి ఇస్తారా?
కురుల్కర్- ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ రెండింటికీ
జరా - అయితే టెస్టులు, ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయా?
మరొక చాట్‌లో, కురుల్కర్ బ్రహ్మోస్ క్షిపణి గురించి జారాతో మాట్లాడాడు...
జరా- బ్రహ్మోస్ కూడా మీ ఆవిష్కరణేనా బేబ్?
జరా- ఇది చాలా ప్రమాదకరం
కురుల్కర్- నా దగ్గర ప్రిలిమినరీ డిజైన్ రిపోర్టులు ఉన్నాయి
జరా- బేబీ...
జరా- ఇది ఎయిర్ లాంచ్ వెర్షన్ కాదా
జరా- మనం ఇంతకు ముందు చర్చించుకున్నదేనా?
కురుల్కర్- అవును (దీంతో పాటు మరింత ముఖ్యమైన సమాచారాన్ని కూడా పంచుకున్నారు)
బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, UCV, అగ్ని క్షిపణి లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పొందడానికి పాకిస్తాన్ ఏజెంట్ ప్రయత్నించారని ఏటీఎస్ పేర్కొంది. "ఆమె పట్ల ఆకర్షితుడైన కురుల్కర్, డీఆర్డీవోకు సంబంధించిన సీక్రెట్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను తన పర్సనల్ ఫోన్‌లో భద్రపరిచాడు. దాన్నిజారాతో పంచుకున్నాడు" అని చార్జిషీట్ లో నివేదించింది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు (SAM), డ్రోన్‌లు, బ్రహ్మోస్, అగ్ని క్షిపణి లాంచర్లు, UCVలతో సహా వివిధ ప్రాజెక్టుల గురించి ఏజెంట్ కురుల్కర్.. దాస్‌గుప్తాతో మాట్లాడారని ఏటీఎస్ పేర్కొంది. ATS తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు సంభాషణ కొనసాగించారు.