మమ్మల్నీ జాబ్​లోకి తీసుకోండి

మమ్మల్నీ జాబ్​లోకి తీసుకోండి
  • సర్కార్​కు మిషన్ భగీరథ, హార్టీ కల్చర్ మాజీ ఉద్యోగుల విజ్ఞప్తి 
  •     మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తూ వినతులు


హైదరాబాద్, వెలుగు:  ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటున్నట్లు రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో గతంలో ఉద్యోగాలను కోల్పోయిన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లలాగే తమను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మిషన్ భగీరథలో పనిచేసిన వర్క్​ ఇన్​స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, హార్టీ కల్చర్ డిపార్ట్​మెంట్​లో పని చేసిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. తాము ఇల్లు గడవక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తమను తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. 

రోడ్డునపడ్డ మిషన్ భగీరథ వర్క్ ఇన్​స్పెక్టర్లు

2015లో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్​ను ప్రారంభించింది. ఇందుకోసం వాటర్ ట్యాంకులు, మెయిన్ పైపులైన్లు, ఇంట్రా పైపులైన్ల నిర్మాణం చేపట్టింది. మిషన్ భగీరథ స్కీమ్ నిర్వహణ కోసం 47 జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టులు, 662 మంది వర్క్‌‌‌‌ ఇన్స్‌‌‌‌స్పెక్టర్లను అప్పట్లో  నియమించింది. వీరి నియామకం కోసం  ప్రత్యేకంగా జీవో నంబర్ 26 విడుదల చేసింది. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చేసిన వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలోనే మెరిట్ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, డ్రాయింగ్‌‌‌‌ల ప్రకారం భగీరథ ట్యాంకులు, పైపులైన్‌‌‌‌ పనులు చేయించడం వీరి పని. రోజూ ఫీల్డ్ లో తనిఖీలు చేయడం, రికార్డులు అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసి, ఫొటోలు తీసి వెబ్​సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయడం, ఉన్నతాధికారులకు పంపాలి. ఆయా వర్క్ ఏజెన్సీల ద్వారా వీరంతా రిక్రూట్‌‌‌‌ అయినప్పటికీ.. తర్వాత అందరి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఆర్ డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో చెప్పారు. పీఎఫ్‌‌‌‌, ఈఎస్‌‌‌‌ఐ వసతి కల్పించారు. అయితే వీరిని రెగ్యులరైజ్ చేయకపోగా.. కరోనా టైమ్​లో 2020 జులై 1 నుంచి ఉద్యోగాలకు రావొద్దని చెప్పారు. సర్వీస్ రెగ్యులరైజ్ అవుతుందనకుంటే మొత్తానికే తీసేయడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులు, మిషన్ భగీరథ ఉన్నతాధికారులను కలిసి తమను కూడా మళ్లీ జాబ్​లోకి తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

హార్టీకల్చర్​లో 500 మంది

హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ పరిధిలోని వివిధ ఆఫీసుల్లో సుమారు 500 మంది వరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తుండేవారు. వీరిని కరోనా టైంలోనే ప్రభుత్వం తీసేసింది. జీతాలివ్వలేమని, మీ అవసరం లేదని ఇంటికి పంపేశారు. దీంతో తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

మా కుటుంబాలను ఆదుకోవాలె

మా ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. మిషన్ భగీరథ పనులన్నీ చేయించుకుని.. ప్రతి ఇంటికి నీరందాక ఇలా ఉద్యోగాల్లో నుంచి తీసేయడం న్యాయం కాదు. ఫీల్డ్ అసిస్టెంట్లలాగే మమ్మల్ని కూడా మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోండి. మా కుటుంబాలను ఆదుకోండి. 
- వినయ్, సెక్రటరీ, మిషన్ భగీరథ వర్క్ ఇన్ స్పెక్టర్స్ అసోసియేషన్