తీరొక్క మొక్క.. చూస్తే కొనడం పక్కా

తీరొక్క మొక్క.. చూస్తే కొనడం పక్కా
  • అన్ని రాష్ర్టాల నర్సరీల  మొక్కలు లభ్యం
  •  అందుబాటులో   కూరగాయల మొక్కలు  
  • ఈనెల 23 వరకు  కొనసాగనున్న మేళా

 హైదరాబాద్, వెలుగు: ఏడారి మొక్కల నుంచి వందల ఏండ్ల బోన్సాయ్ చెట్ల వరకు ఎన్నో రకాల మొక్కలకు నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వేదికైంది. తీరొక్కటిగా ఉండి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.  పదో ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ మేళా గురువారం నుంచి షురూ అయింది.  కరోనా తర్వాత లాక్ డౌన్ నుంచి సిటిజన్లు గార్డెనింగ్ , మొక్కల పెంపకంపై ఎక్కువగా ఇంట్రెస్ట్​పెట్టారు. ఇంట్లో ఎప్పటికప్పుడు గ్రీనరీ ఉండేలా చూసుకుంటున్నారు. మొక్కలు కొనేందుకు మేళాను సందర్శిస్తుండగా సందడి నెలకొంది. విభిన్న రకాల మొక్కలు, కుండీలు, గార్డెనింగ్ వస్తువులతో 140 స్టాళ్లలో ఏర్పాటైంది. ఈ నెల 23వరకు కొనసాగనుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి  తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ  ఫీజు రూ. 20 గా ఉంది. మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చిందని మేళా నిర్వాహకులు చెప్పారు. 
ఇంటీరియర్​ నుంచి పండ్ల మొక్కల దాకా..
ఇండోర్, ఔట్ డోర్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, మెడిసిన్, ఆక్సిజన్, షోకేజ్, కలర్​ఫుల్​, బోన్సాయ్ ఇలా అన్నీ రకాల ప్లాంట్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీ నిర్వాహకులు, మొక్కల బిజినెస్​ చేసేవాళ్లు కూడా స్టాళ్లు ఏర్పాటు చేశారు.  పూలు, కూరగాయలు, పండ్ల, ఇంటీరియర్ , టెర్రస్ గార్డెనింగ్ మొక్కలు, గోడలపై పెట్టుకునే వర్టికల్ గార్డెన్ మొక్కలు, గ్రాండ్ లుక్ కనిపించే ఆర్టిఫిషియల్ మొక్కలు కూడా ప్రదర్శనకు ఉంచారు. గులాబీ, బంతి, చామంతులు, జరేనియా, లిల్లీ, దాలియా, పెటానియా, ఇన్పేషన్స్ పూల మొక్కలు కూడా ఆకర్షిస్తున్నాయి. కమలం, వాటర్ లిల్లీ, పిస్కియా, అలాకేషియా వంటి వాటర్ బేస్డ్ ప్లాంట్స్,  బత్తాయి, నారింజ, రేగి , జామ, ద్రాక్ష, దానిమ్మ, సపోటా తదితర పండ్ల మొక్కలు లభిస్తున్నాయి. టమాట, బెండకాయ, చిక్కుడు, బీరకాయ, వంకాయ, సొరకాయ, మునగకాయ, కాకరకాయ, మిరపకాయ, కొత్తీమీర తదితర మొక్కలతో పాటు వాటికి సంబంధించిన విత్తనాలు కూడా అమ్ముతున్నారు. 
 తక్కువ స్థలంలో ఎక్కువగా పెంచుకునేలా..
తక్కువ స్పేస్ లో ఎక్కువ మొక్కలను పెంచుకునేందుకు ఎంతో క్రియేటివ్ డిజైన్ చేసిన పాట్ స్టాండ్స్ స్పెషల్ అట్రాక్షన్ . డిఫరెంట్ కలర్స్ , షేప్స్ లో ఉన్నాయి. ఎకో ఫ్రెండ్లీ పాట్స్ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొబ్బరి నారతో తయారైన ఎన్విరాన్​మెంట్​పాట్స్, గార్డెన్ అందంగా కనిపించే బొమ్మల ఆకారాల్లోని పాట్స్ స్టాల్స్ లో పెట్టారు.  పెబ్బల్స్, గార్డెనింగ్ షోకేజ్ ఐటమ్స్, హ్యాంగింగ్స్, ఎరువులు, సేంద్రియ పురుగుల మందులు, సిరామిక్, ఫైబర్ ప్లాంటర్స్, విత్తనాలు, బల్బులు, టూల్స్, ఇండియన్, ఇంపోర్టెడ్ పరికరాలు లభిస్తాయి. 
అన్ని రాష్ర్టాల నుంచి గార్డెనింగ్ ​మొక్కలు
కశ్మీర్, వెస్ట్ బెంగాల్, హర్యానా ఇలా అన్ని స్టేట్​ల నుంచి గార్డెనింగ్​మొక్కలను తెచ్చారు.  మెడిసినల్, ఆక్సిజన్, ఫ్రూట్, మసాలా ప్లాంట్స్ , దుంపలు, సీడ్స్ కూడా ఉన్నాయి. ఆర్కిడ్, కాక్టస్ స్టాల్స్ స్పెషల్​గా కనిపిస్తున్నాయి. పాట్ మిక్చర్, టెర్రస్ గార్డెన్ మెటిరీయల్, హైడ్రో పోనిక్ సిస్టం ఇలా అన్ని రకాల టెక్నిక్స్ తో గార్డెన్ ఎలా చేయొచ్చో తెలుసుకోవచ్చు.  ఏడాదిలో రెండు సార్లు మేళా నిర్వహిస్తుంటాం.   
‑ ఖలీద్ అహ్మద్, నిర్వాహకుడు, నర్సరీ మేళా 

బ్యాంకాక్​ ఆర్కిడ్స్​ తెచ్చా..
20 కలర్స్​లో ఆర్కిడ్స్ తెచ్చా. బ్యాంకాక్ నుంచి ఇంపోర్ట్ చేసు కుంటాం. 7 ఎకరాల్లో నర్సరీ పెట్టాం. డెకరేషన్, పాట్ ప్లాంట్ రెడీ చేసి ఇస్తాం. ఒక్కో దాని రూ.వెయ్యి  నుంచి ఉంటుంది. వీటిని సెమీ షేడ్ లో పెట్టాలి. కోకోనట్​లు బొగ్గులో కూడా పెరుగుతాయి. వీటికి లాంగ్ లైఫ్ ఉంటుంది. కుండీలో తేమ చూసుకుని అవసర మైన నీరు పోస్తే సరిపోతుంది. 1500 ప్లాంట్స్ తీసుకొచ్చాం. కస్టమర్ల నుంచి రెస్పాన్స్ బాగుంది.                                                                             - శ్రీనివాస్, మేనేజర్, ఆర్కిడ్స్  ప్లాంట్ స్టాల్ నిర్వాహకుడు, తణుకు