మరికల్/ నారాయణపేట, వెలుగు : పామాయిల్ సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని హార్టికల్చర్, సెరికల్చర్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్పొన్నుస్వామి తెలిపారు. గురువారం మండలంలోని జిన్నారం, తీలేరు, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పామ్, మామిడి, కూరగాయల తోటలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 10 శాతం విస్తీర్ణంలోనే సాగు జరుగుతోందన్నారు. ఇక్కడి నేలలు ఈ పంటకు అత్యంత అనుకూలమని, రైతులు ధైర్యంగా సాగు చేపట్టవచ్చని సూచించారు. అనంతరం ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన (పీఎండీడీకేవై) స్కీమ్‌పై నారాయణపేట కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి సమీక్షించారు. స్కీమ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
