
ముషీరాబాద్, వెలుగు: హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌కుమార్ సూచించారు. చిక్కడపల్లి డివిజన్ లోని హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులతో బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజిస్టర్ మెయింటేన్చేయాలని, లాడ్జి, హోటల్ కు వచ్చినవారి ధ్రువీకరణ తీసుకోవాలని చెప్పారు. 24 గంటలు సీసీటీవీ నిఘా ఉండాలని, నెల రోజులపాటు వీడియో స్టోరేజీ ఉండేలా చూడాలన్నారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా మేజర్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. మైనర్లకు రూమ్‌లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సీఐ రాజునాయక్, ముషీరాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నదీమ్ హుస్సేన్, చిక్కడపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు.