కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక్కరోజే ఉండడంతో రాష్ట్రంలోని పలు హోటళ్లు ఓటర్లు ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఆపర్లు ప్రకటిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న ఆఫర్లను దృష్టిలో ఉంచుకుని బృహత్ బెంగళూరు మహానగర పాలికే చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ కీలక ప్రకటన చేశారు. ఈ తరహా ఆఫర్లను ఎవరూ ప్రకటించవద్దని, డిసౌంట్ల పేరుతో ఎలాంటి తినుబండారాలను అందించవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
నగరంలోని నిసర్గ గ్రాండ్ తో పాటు చాళుక్య సామ్రాట్ అనే హోటళ్లు పలు ఆఫర్లను ప్రకటించాయి. కానీ అందులో రాజకీయం గానీ, పక్షపాత ధోరణి గాని లేదని.. కేవలం ఓటింగ్ శాతాన్ని పెంచడానికే ఈ డిసౌంట్లను ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బెంగళూరులో 54.7శాతం పోలింగ్ నమోదైన నేపథ్యంలో.. అప్పట్నుంచి ఈ ఆఫర్ల ట్రెండ్ మొదలైనట్టు తెలుస్తోంది.
ఇంతకుముందే ఓటర్లకు ఉచిత అల్పాహారం అందిస్తామని నృపత్ ఉంగ రోడ్‌లోని హోటల్ నిసర్గ గ్రాండ్ తెలిపింది. అందులో భాగంగా బటర్ దోసె, మైసూర్ పాక్, కూల్ డ్రింక్ లను అందిస్తామని వెల్లడించింది. 2018, 2019లోనూ ఇలాంటి ఆఫర్లతో ఓటర్లను ఆకర్షించిన ఈ హోటల్.. ఈ సారి కూడా స్పెషల్ ఆఫర్స్ తో ముందుకొచ్చింది. 2018లో 3900మంది, 2019లో 5100మంది ఓటర్ కస్టమర్లు తమ ఆఫర్ ను సద్వినియోగం చేసుకున్నారని, అందులో కొందరు సినీ నటులు కూడా ఉన్నారని హోటల్ యజమాని కృష్ణ రాజ్ తెలిపారు. ఈ సారి కూడా ఎన్నికల పండగ కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
దీంతో పాటు 100మంది కొత్త ఓటర్లకు సినిమా టికెట్టును కూడా ఉచితంగా అందిస్తామని హోటల్ హోర్డింగ్ లో తెలిపింది. అందులో భాగంగా మొదటి 100మంది కొత్త ఓటర్లకు కన్నడ సినిమా టికెట్ ను ఫ్రీగా ఇవ్వనున్నామని, ఈ విషయంపై కన్నడ ఫిల్మ్ ఛాంబర్ తోనూ చర్చించినట్టు హోటల్ వెల్లడించింది. ఇక చర్చి స్ట్రీట్ లోని చాళుక్య సామ్రాట్ కేఫ్ ఓటర్లకు ఉ.7.30 నుంచి 11.30 వరకు ఉచిత అల్పాహారం అందించాలని నిర్ణయించింది.