
- కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసిన హైపవర్ కమిటీ
- 13న భేటీలో తుది నిర్ణయం
- 20 లోపు సర్కారుకు రిపోర్ట్
అమరావతి, వెలుగు:
ఏపీ రాజధాని తరలింపుపై రోండో సారి భేటీ అయిన హైపవర్ కమిటీ కీలక సిఫార్సులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. వీటిలో అమరావతి నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు వీఎండీసీ పరిధిలో 25 లక్షలకే ఇంటి స్థలం కేటాయించాలని ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం. భార్యాభర్తలు ఉద్యోగులు అయితే ఖాళీలతో సంబంధం లేకుండా ట్రాన్స్ ఫర్ చేయాలని, ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ, 10శాతం సీసీఏ, షిఫ్టింగ్ కోసం హోదా బట్టి రూ. 50 వేల నుంచి లక్ష వరకు చెల్లింపు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగి ఒక్కరే విశాఖకు వస్తే ఉచిత వసతి, కుటుంబంతో వస్తే నెలకు రూ.4 వేలు చొప్పున అద్దె కోసం అదనపు మొత్తం చెల్లించాలని కమిటీ భేటీలో చర్చించినట్లు సమాచారం. వారానికి ఐదు రోజుల పనిదినాల కొనసాగింపు, స్థానికతపై 2024 డిసెంబర్ 31 వరకు గడువు పెంపునకు తీర్మానించినట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ నిబంధనను 28 ఏళ్ల నుంచి 25 లేదా 26 ఏళ్లకు కుదింపు. ప్రతి ఉద్యోగికి వచ్చే ఐదేళ్లలో విశాఖ పరిధిలో 200 గజాల ఇళ్ల స్థలం కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో రాజధాని తరలింపు, రాష్ర్ట సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హైపవర్ కమిటీ సమావేశమైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో 9 మంది మంత్రులతోపాటు సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.
ముందుగా అమరావతినే డెవలప్ చేస్తాం: పేర్ని నాని
హైపవర్ కమిటీ భేటీ తర్వాత ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఏపీలోని అన్ని ప్రాంతాల కంటే ముందు అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ రాజకీయ లబ్ధి కోసం అమరావతి రైతులను రెచ్చగొడుతోందని విమర్శించారు.