
ఉచిత బస్సు సౌకర్యంతో 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు 6 వేల 680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని చెప్పిన డిప్యూటీ సీఎం..ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ MGBS బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ లో మహిళలు 200 కోట్ల జీరో టికెట్లు ప్రయాణం పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9 న ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని అన్నారు. ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభిస్తున్నపుడు.. ఆర్టీసీ మునిగి పోతున్న పడవ ఎందుకు ఎక్కుతారు అని ఆరోజు ఎద్దేవా చేశారని.. కానీ.. ఆర్టీసీ మునిగిపోతున్న నావ కాదు.. లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ అని అన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల మహిళా ప్రయాణికుల చార్జీలను 6680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించిందని చెప్పారు. భవిషత్ లో కూడా మహిళల ఛార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
ఉచిత ప్రయాణం ద్వారా ప్రభుత్వం చెల్లించిన ఆదాయంతో కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఆర్టీసీ ఎదిగిందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని తెలిపారు. ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సి రేషియో 62 శాతం ఉంటే ఇప్పుడు 97 శాతానికి పెరిగిందని అన్నారు. మహాలక్ష్మికి ముందు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని గుర్తు చేశారు.
హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చడానికి నగరంలో ఉన్న 2800 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ కసరత్తు చేస్తుందని తెలిపారు. మంత్రి పొన్నం సూచనమేరకు ఇప్పటికే 3000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. 11 శాతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి..దానిని పెంచుకుంటూ పోతున్నారని అన్నారు.
►ALSO READ | చిట్యాలలో అర్హులందరికీ రేషన్ కార్డులు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని భట్టీ తెలిపారు. ఆర్టీసీ లో కేవలం ప్రయాణమే కాదు.. ఆర్టీసీ బస్సులకు యాజమానులను చేశామని తెలిపారు. వడ్డీలేని రుణాలు ద్వారా బస్సులు కొనుగోలు చేయించామని.. 150 మహిళా సంఘాల ఆర్టీసీ బస్సు యజమానులకు కోటి రూపాయల చెక్కులు ఇటీవలే అందించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే రూ.25 వేల కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించామని.. ఈ 5 ఏళ్లలో లక్ష కోట్లు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కోట్ల రూపాయలతో రోడ్ల మరమత్తులు , అభివృద్ధి చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నారని తెలిపారు. దీని ద్వారా రవాణా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకున్న మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు స్పెషల్ సీ ఎస్ వికాస్ రాజ్, ఆర్టీ సి ఎండి సజ్జనార్ హాజరయ్యారు.