
బుల్లితెర రియాల్టీ షో 'బిగ్ బాస్' కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ.. ఈసారి మరింత డ్రామా, ఉత్కంఠ, ఎంటర్ టైన్మెంట్ ఉండేలా 'బిగ్ బాస్ సీజన్ 9' ( Bigg Boss Telugu 9 )ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కు సంబందించిన ఏర్పాట్లు అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతున్నాయి. కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు నిమగ్నమైయ్యారు.
మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ ( Akkineni Nagarjuna) గా వ్వవహారించనున్న ఈ 'బిగ్ బాగ్ సీజన్ 9' షో కంటెస్టెంట్స్ పేర్లపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈసారి హౌస్ లోకి వెళ్లేది ఎవరు, సినీ స్టార్లు వస్తున్నారా. అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. "ఈసారి చదరంగం కాదు, రణరంగమే" అంటూ నాగార్జున కొత్త సీజన్ ప్రోమోలో చెప్పిన డైలాగ్, ఈసారి పోటీ ఎంత హోరాహోరీగా ఉండబోతుందో తెలియజేస్తుంది. సెప్టెంబర్ 7, 2025న స్టార్ మాలో ' బిగ్ బాస్ తెలుగు 9 '( Bigg Boss Telugu 9 ) గ్రాండ్ ప్రీమియర్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు.
అయితే ఈ సారి ఎలిమినేషన్స్ చాలా స్పెషల్ గా జరుగబోతున్నాయని తెలిసింది. గతంలో చాలా మంది సినీ ప్రముఖులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఈ షోకు వచ్చేవారు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది తారలు బిగ్ బాస్ హౌస్ లోనే ఉండి యాక్టివిటీస్ లో పాల్గొంటారు. ఆ తర్వాత వారి చుట్టూ ఎలిమినేషన్స్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా, ఎంటర్ టైన్మెంట్ గా ఉండేలా ఈ ఫార్మాట్ ను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అటు బిగ్ బాగ్ హౌస్ లోకి వెళ్లే వాళ్ల పేర్లు ఒక్కొక్కటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సీజన్ 9 కోసం ఇప్పటికే బుల్లితెరతో వెండితెర నటీనటులు, సింగర్స్, యాంకర్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్ ను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేసినట్లు వారి పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్లుగా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య , ప్రియాంక్ జైన్, వీజే సన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు సీరియల్ నటులు సాయి కిరణ్, నటి రీతూ చౌదరి, జబర్దస్త్ షోలో మంచి కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్, వర్ష తోపాటు నటుడు పరమేశ్వర్ హివ్రాలే, తెలంగాణకు చెందిన జానపద నృత్య కారిణి నాగ దుర్గా గుత్తా, నేపథ్య గాయకుడు శ్రీతేజ కందర్ప పేర్లు వినిపిస్తున్నాయి.
అంతే కాదు గత సీజన్స్ లో పాల్గొన్నవారు కూడా ఈ సారి హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టంట్స్ పేర్లను మేకర్స్ నుంచి అధికార ప్రకటన చేయలేదు. వారి నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ హౌస్ మేట్స్ ఎవరనేది స్పష్టత వస్తుంది. అప్పటి వరకు కంటెస్టంట్స్ పై ఉత్కంఠ తప్పదు.