నాగార్జున సాగర్ నిండకముందే శ్రీశైలంకు చిల్లు పెడుతోన్న ఏపీ!..

నాగార్జున సాగర్ నిండకముందే శ్రీశైలంకు చిల్లు పెడుతోన్న ఏపీ!..
  • పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఇప్పటికే 50 టీఎంసీలకు పైగా తరలింపు
  • అధికారికంగా పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 20 వేల క్యూసెక్కులు
  • అనధికారికంగా తరలిస్తున్నది 80 వేల క్యూసెక్కులకుపైనే!
  • వారం నుంచి శ్రీశైలం డ్యామ్‌కు సగటున లక్ష క్యూసెక్కుల ఇన్​ఫ్లో 
  • తెలంగాణ లిఫ్టుల ద్వారా తరలించింది 4.5 టీఎంసీలే
  • ఏపీ దోపిడీపై చోద్యం చూస్తున్న కేఆర్ఎంబీ

మహబూబ్‌నగర్, వెలుగు: నాగార్జునసాగర్​ నిండకముందే  శ్రీశైలం రిజర్వాయర్‌‌ను ఏపీ ఖాళీ చేస్తున్నది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లే పోతిరెడ్డిపాడు  ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించుకుపోతున్నది. అధికారికంగా 20 వేల క్యూసెక్కులే తరలిస్తున్నట్లు చెప్తున్నా.. అనధికారింగా 80 వేల క్యూసెక్కులకుపైగా తరలిస్తున్నట్లు లెక్క తేలుతున్నది. ఈ ఏడాది మే 29న  శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలుకాగా.. వచ్చిన నీళ్లు వచ్చినట్లు స్పిల్‌వే, పవర్​జనరేషన్​ద్వారా నాగార్జునసాగర్‌‌కు విడిచిపెట్టాలి. నాగార్జునసాగర్  కెపాసిటీ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం257 టీఎంసీలకు చేరింది. సాగర్​ నిండాలంటే ఇంకా 55 టీఎంసీలు కావాలి. కానీ శ్రీశైలం నిర్వహణ ఏపీ చేతుల్లో ఉండడంతో  వారం రోజులపాటు స్పిల్​వేను బంద్​పెట్టి మరీ ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 50 టీఎంసీలకు పైగా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించినట్లు స్పష్టమవుతున్నది. అదే సమయంలో తెలంగాణలోని నెట్టెంపాడు, భీమా–-​1, 2, కోయిల్​సాగర్, కల్వకుర్తి లిఫ్టుల ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసింది 4  టీఎంసీలు మాత్రమే! అంటే ఏపీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్థమవుతున్నది.

శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు వద్ద టెలీమెట్రీలు లేకపోవడంతో ఏపీ నీటి దోపిడీకి లెక్కాపత్రం లేకుండా పోయింది. ఈ ఏడాది మే 29న  శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. అంతకుముందు రోజు అంటే 28న శ్రీశైలంలో 37 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, వరద మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 356 టీఎంసీలు వచ్చి చేరింది. అదేరోజు సాగర్‌‌‌‌‌‌‌‌లో 135 టీఎంసీల నీరుండగా, ప్రస్తుతం 257 టీఎంసీలు నిల్వ ఉంది. అంటే పవర్​ జనరేషన్​, స్పిల్‌‌‌‌వే ద్వారా శ్రీశైలం నుంచి సాగర్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటివరకు చేరిన నీళ్లు 122 టీఎంసీలే అని తెలుస్తున్నది.  ప్రస్తుతం శ్రీశైలంలో 208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు  ప్రాజెక్టుల్లోని ఆవిరి నష్టాలను, పాలమూరు వైపు తెలంగాణ లిఫ్టు స్కీమ్స్‌‌‌‌కు తరలించిన 4 .5 టీఎంసీలను తీసేసినా  సుమారు 50 టీఎంసీలను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించినట్లు స్పష్టమవుతున్నది. 

తెలంగాణకు ఎత్తిపోసింది 2 టీఎంసీలే 

ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాలో జూరాల కింద నెట్టెంపాడు, భీమా–1, 2, కోయిల్​సాగర్​ లిఫ్టు స్కీమ్స్​ ఉండగా.. శ్రీశైలం కింద మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​ (ఎంజీకేఎల్ఐ) నడుస్తున్నది. గడిచిన వారం రోజులుగా సగటున జూరాల కింద నెట్టెంపాడు ద్వారా750 క్యూసెక్కులు, భీమా–1, 2 కలిపి 1,400  క్యూసెక్కులు, కోయిల్​సాగర్​ద్వారా 315 క్యూసెక్కులు, కల్వకుర్తి ద్వారా 800  క్యూసెక్కులు తరలిస్తున్నారు. అంటే వారం రోజుల్లో కృష్ణా బేసిన్‌‌‌‌లోని జూరాల,  శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి మహబూబ్‌‌‌‌నగర్​ జిల్లాకు తరలించింది కేవలం 2 టీఎంసీలే కావడం గమనార్హం. అదే సమయంలో ఏపీ అధికారికంగానే 12 నుంచి 15 టీఎంసీలు, అనధికారంగా 40 టీఎంసీలకు పైగా తరలించినట్లు తెలుస్తున్నది.

 ఇరిగేషన్ ఆఫీసర్ల లెక్కల ప్రకారం ఈ నెల  15న శ్రీశైలం ప్రాజెక్టులో 204 టీఎంసీల నీరు ఉండగా,  వారం రోజులుగా ఎగువన ఉన్న జూరాల, సుంకేశుల ద్వారా శ్రీశైలం డ్యామ్‌‌‌‌కు సగటున లక్ష క్యూసెక్కుల చొప్పున వచ్చి చేరుతున్నది . ఇలా వచ్చిన నీళ్లను వచ్చినట్లు సాగర్​కు విడుదల చేయాల్సి ఉండగా,  ​ కేవలం పవర్​జనరేషన్​కోసం నీటిని విడుదల చేస్తూ క్రస్ట్​గేట్లను బంద్​పెట్టారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లేందుకే స్పిల్‌‌‌‌వే ద్వారా విడుదలను ఆపేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈలోగా మంగళవారం  శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్​కెపాసిటీ  (883 అడుగులకు) చేరడంతో ఆఫీసర్లు హుటాహుటిన ఒక క్రస్ట్​గేటు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు 27,570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. క్రస్ట్​గేట్లను బంద్​పెట్టి మరీ పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిదోపిడీ కొనసాగిస్తుంటే.. వారించాల్సిన కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ ) చోద్యం చూస్తుండడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.