2 BHK ఫ్లాట్ అద్దె రూ. 50 వేలు.. బెంగళూరులో అంత డిమాండ్ ఏంటీ

2 BHK ఫ్లాట్ అద్దె రూ. 50 వేలు.. బెంగళూరులో అంత డిమాండ్ ఏంటీ

భారత్ లో డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ ఎంత ఉంటుంది..? మహా అయితే.. 10 లేదా25 వేలు, 30 వేల వరకూ ఉంటుందని చెబుతారు. కానీ... బెంగళూరులో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంటు ఎంతో తెలుసా..? అక్షరాల రూ.50 వేలు. ఈ మధ్య బెంగళూరులో ఇండ్ల అద్దెలు భారీగా పెరిగిపోయాయి. సామాన్యుడి భరించలేనంత రెంట్లు అమాంతం పెరిగిపోయాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇళ్ల అద్దెలు 2022 ఆరంభంతో పోలిస్తే దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్‌ మార్కెట్‌గా మారింది.

‘సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇళ్ల యజమానులు ఇప్పుడు తమ ఆదాయంలో ఎక్కువ సంపాదన ఇంటి అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్‌ రీసెర్చ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గూగుల్‌, అమెజాన్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, యాక్సెంచర్‌.. వంటి పెద్ద సంస్థలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని వివిధ సర్వేల అంచనా. కొవిడ్‌ సమయంలో వీరందరికీ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ సదుపాయం కల్పించడంతో సొంతూళ్లకు వెళ్లారు చాలామంది. దీంతో ఇళ్ల అద్దెలు చాలా వరకూ తగ్గిపోయాయి. 

కొవిడ్ వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చాలామంది ఉద్యోగులు కంపెనీలకు వెళ్లి పని చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచి చేసే పనికి పుల్ స్టాప్ పెట్టారు. దీంతో చాలామంది ఉద్యోగులు మళ్లీ బెంగళూరు బాట పట్టడంతో మళ్లీ ఇంటి అద్దెలు పెరిగిపోతున్నాయి. ఇంటి అద్దెలు పెంచడం వల్ల కొవిడ్‌ సమయంలో వాటిల్లిన నష్టాల్ని యజమానులు ఇప్పుడు పూడ్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగళూరులో ‘రెంటల్‌ మార్కెట్‌’కు మంచి డిమాండ్‌ ఉందని చెబుతున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని చాలామంది ఉద్యోగులు వాపోతున్నారు. 

ఇప్పుడు ఇంటి ఓనర్లు కొత్త కొత్త రూల్స్ కూడా తీసుకొస్తున్నారని తెలుస్తోంది. రాత్రి పూట గెస్ట్‌లకు అనుమతి ఇవ్వట్లేదట. ఇంటి అద్దె కోసం వచ్చే వారిని పలు రౌండ్లు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారట. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ ఇవ్వడం తప్పనిసరని చెబుతున్నారు. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు..? ఏ కంపెనీలో చేస్తున్నారు..? సాలరీ ఎంత..? వంటి విషయాలను అడుగుతున్నారట. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతే ఇళ్ళను అద్దెకు ఇస్తున్నారు. కొంతమంది ఇంటి యజమానులైతే ఉద్యోగుల పే స్లిప్స్ కూడా తీసుకుంటున్నారట. అంతా ఓకే అయితేనే ఇల్లు అద్దెకు ఇస్తున్నారట.

బెంగళూరులో అద్దెలు గత సంవత్సర కాలంగా ఏకంగా రెట్టింపు అయ్యాయట. ఆర్థిక రాజదాని ముంబయి, ఇతర మెట్రో నగరాలు చెన్నై, హైదరాబాద్ కంటే ఇక్కడ అద్దెలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయట. అద్దెలు అంత పెరగడంతో పాటు.. ఇంటి ఓనర్ల కొత్త కొత్త రూల్స్ ఇంజినీర్లకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. దీంతో బెంగళూరులో అద్దె కోసం ఫ్లాట్ దొరకాలంటే కూడా పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుందంట.