ఆ ఊరిని ముంచేసిన గోదావరి వరద

ఆ ఊరిని ముంచేసిన గోదావరి వరద
  • తడిసిన బియ్యం.. బురదతో నిండిన వంట సామాన్లు
  • పనిచేయని టీవీలు, ఫ్రిడ్జిలు, వాషింగ్ ​మెషిన్లు
  • తీవ్రంగా నష్టపోయిన భద్రాద్రి కొత్తగూడెం సున్నంబట్టీవాసులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గోదావరి వరద ఆ ఊర్లో అందరి బతుకులను చిందరవందర చేసింది. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు, సమకూర్చుకున్న సామాన్లు వరద ప్రవాహంతో పాడయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లినవారు ఊరికి వచ్చి చూసి కన్నీరు పెడుతున్నారు. తమ ఏండ్ల కష్టం గోదావరిలో కొట్టుకుపోయిందని వాపోతున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టీ గ్రామం గోదావరి ఒడ్డునే ఉంది. ఇటీవలి వర్షాలకు గోదావరిలో వరద ఉద్ధృతి పెరగడంతో ఆఫీసర్ల సూచన మేరకు గ్రామంలోని దాదాపు 130 కుటుంబాలు ఐదు  రోజుల కింద పునరావాస కేంద్రానికి వెళ్లాయి.

వరద తగ్గడంతో గురువారం కొందరు, శుక్రవారం మరికొందరు ఇండ్లకు చేరుకున్నారు. మోకాలి లోతు వరద నీటిని దాటుకుంటూ గ్రామంలోకి వచ్చినవారికి కనిపించిన దృశ్యాలు కంటతడి పెట్టించాయి. పదుల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఐదారు ఇండ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ముగ్గురి బైకులు, దాదాపు 20 గేదెలు, 22 ఎడ్లు, 130 పైగా కోళ్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 200 క్వింటాళ్ల బియ్యంతో పాటు మినపప్పు, పెసలు తడిసి దుర్వాసన వస్తుండడంతో వాటిని గోదాట్లో పడేశారు. బురదతో పాడైన వస్తువులు, దుస్తులు, దుప్పట్లు, మంచాలను సమీపంలోని వరద నీటిలో శుభ్రం చేసుకుంటున్నారు. కూలిపోయి ఉన్న ఇండ్లలో సామగ్రిని బయటకు తీయడంతో పాటు కొత్తగా ఇంటిని సరి చేసుకునే పనిలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు. 

ఒక్కో ఫ్యామిలీకి 2 లక్షలకుపైగా నష్టం
గ్రామంలోని ప్రతి కుటుంబం రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు నష్టపోయింది. వరదలో తడిసి ముద్దైన ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని గోదాట్లో పడేసినట్లు గ్రామస్తుడు చల్ల శ్రీను చెప్పారు. వాషింగ్​మెషిన్, ఫ్రిజ్​పనికిరాకుండా పోయాయన్నారు. పొలంలో పంట వేద్దామని రూ. 50 వేల మిరప విత్తనాలు, రూ. 15 వేల పత్తి విత్తనాలు తెచ్చి అటక మీద పెడితే వరదలో కొట్టుకుపోయాయని మల్లమ్మ వాపోయారు.

మిల్లు ఆడించి తెచ్చిన బియ్యాన్ని వరద తీసుకుపోయిందని, నెల కింద రూ. 25 వేలు ఖర్చు పెట్టి వేయించిన ఇంటి పైకప్పు మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదతో రూ. 3 లక్షలకు పైగా నష్టపోయానని, బైక్, గొడ్డూ గోదా వరదలో కొట్టుకుపోయాని పసుపులేటి రమేశ్​చెప్పారు. బీరువా కూడా వరదలో కొంతదూరం కొట్టుకుపోయిందన్నారు. ఫ్రిజ్, కూలర్, వాషింగ్​మెషిన్​పని చేయడం లేదన్నారు.