రోడ్లను విస్తరించేందుకు కాలనీల్లో ఇండ్ల కూల్చివేతలు

రోడ్లను విస్తరించేందుకు కాలనీల్లో ఇండ్ల కూల్చివేతలు
  • రెండేండ్ల కింద ధర్మపురిలో 16 రోడ్ల వెడల్పుకు తీర్మానం 
  • మంత్రి ఇలాకాలో గెజిట్ లేకుండానే తీర్మానం అమలు
  • రూల్స్​కు విరుద్ధంగా ఇండ్ల కూల్చివేతలు 
  • కోర్టును ఆశ్రయించిన బాధితులు

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ నుంచి హరిత హోటల్ వెళ్లే మార్గం. గతంలో ఈ రోడ్డు 20 ఫీట్లు ఉండేది. దీన్ని 40 ఫీట్లకు పెంచాలని బల్దియాలో తీర్మానం చేశారు. దీంతో ఇండ్లు, షాపుల కూల్చివేతలు స్టార్టయ్యాయి.  స్థానిక మంత్రి కొప్పులపై కాలనీవాసుల ఒత్తిడి చేయడంతో రోడ్డు వెడల్పును 33 ఫీట్లకు కుదించినా కూల్చివేతలు ఆగలేదు. ఈ కాలనీలో సుమారు 50  ఇండ్ల వరకు నిరుపేదలు తీవ్రంగా నష్టపోగా, దాదాపు 15 షాపులు కూల్చివేయడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. 

జగిత్యాల/ధర్మపురి, వెలుగు: ధర్మపురి పంచాయతీ 2016 లో మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. పట్టణ అభివృద్ధిలో భాగంగా టౌన్​లోని సుమారు 16 రోడ్లను విస్తరించాలని మున్సిపల్​పాలకవర్గం 2018 లో తీర్మానం చేసింది. దీనిలో భాగంగా రోడ్లను విస్తరించేందుకు కాలనీల్లో ఇండ్ల కూల్చివేతలు స్టార్ట్​చేశారు. సుమారు 500 మంది తమ ఇండ్లను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కోల్పోయారు. వీరిలో అధికార పార్టీకి చెందిన వారి ఇండ్లు ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఇండ్లు మరోరకంగా కూల్చివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  బాధితులు స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్​పై ఒత్తిడి పెంచడంతో 40 ఫీట్లుగా ఉన్న రోడ్డు విస్తరణను 33 ఫీట్లకు కుదించారు. అయినప్పటికీ కూల్చివేయక తప్పలేదు. మంత్రి సొంత నియోజకవర్గంలోనే గెజిట్​ లేకుండా కూల్చివేతలు కొనసాగిస్తుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇవ్వకుండా కూల్చి వేసి తమకు అన్యాయం చేశారని బాధితులు వాపోతున్నారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం కూల్చివేతలు ఆగిపోయాయి. 

రోడ్ల వెడల్పు ఇలా.. 

టౌన్ లో చాలా వరకు రోడ్లను 40 నుంచి 100 ఫీట్ల వరకు పెంచేందుకు బల్దియా తీర్మానం చేసింది.  వివేకనంద నుంచి దమ్మన్నపేట్ రోడ్ 60 ఫీట్లుగా, తెనుగువాడ గద్దె నుంచి బ్రాహ్మణ సంఘం వరకు 40-60 ఫీట్లు, పటేల్ చౌరస్తా నుంచి నందిచౌక్ వరకు 60 ఫీట్లు, నండి నుంచి హరిత హోటల్ వరకు 40--–50 ఫీట్లు, నందిచౌక్​ నుంచి బ్రాహ్మణ సంఘం వరకు 50--–80 ఫీట్లు, శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి టెంపుల్ నుంచి సంతోషిమాత టెంపుల్ వరకు 40--–50 ఫీట్లు, బ్రాహ్మణ సంఘం నుంచి నైట్ కాలేజ్ వరకు 60 ఫీట్లు, గాంధీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు 60 ఫీట్లు, నంది నుంచి పైలాన్ చౌరస్తా వరకు 60 ఫీట్లు, ఎన్ హెచ్ 63 నుంచి సంతోషిమాత టెంపుల్ వరకు 60 ఫీట్లు, సబ్ స్టేషన్ న్యూ ఒడ్డెర కాలనీ నుంచి హరిత హోటల్ బ్యాక్ సైడ్ వరకు 100 ఫీట్లు, అంబేద్కర్ నుంచి రాజరాజేశ్వర టెంపుల్ 60 ఫీట్లు, ఎన్ హెచ్–60 నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు 60 ఫీట్లు, తెనుగువాడ గద్దె నుంచి నక్కలపేట్ రోడ్ వరకు 60 ఫీట్లు, పటేట్ చౌరస్తా గుండయ్యపల్లె నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్​వరకు 60 ఫీట్లు, గాంధీ నుంచి సర్గమ్మ వాడ 40 ఫీట్లుగా రోడ్లు వెడల్పు చేయాలని తీర్మానం చేశారు. 

ఇండ్ల కూల్చివేతలో రూల్స్​పాటించలే

రోడ్లు విస్తరించేందుకు మున్సిపల్​సమావేశంలో తీర్మానం చేశాక.. దాన్ని కలెక్టర్ పర్మిషన్ తో హైదరాబాద్ ఆర్డీ ఆఫీస్​కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ అప్రూవల్​వస్తే తిరిగి కలెక్టర్​ఆమోదంతో ప్రజాభిప్రాయం తీసుకునేందుకు నోటిఫికేషన్​ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజుల సమయం ఇచ్చి ప్రజల అభ్యంతరాలను ఫిర్యాదు లు తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి. ఇండ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం, బాధితులకు మరో చోట స్థల కేటాయింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ స్టేట్ ఆఫీసర్లు జీవో జారీ చేయాలి. ఆ తర్వాతే స్టేట్ సర్కార్ గెజిట్ రిలీజ్​అయి విస్తరణ పనులు స్టార్ట్​చేయాలని రూల్స్​చెబుతున్నాయి. ఎక్కడా ఈ ప్రోసిజర్ ను ఫాలో కాకుండా బల్దియా  తీర్మానం చేసి నోటీసులు ఇవ్వకుండానే ఇండ్లు కూల్చివేయడం స్టార్ట్​చేసింది.

కోర్టుకు బాధితులు 

రోడ్ల విస్తరణలో భాగంగా సుమారు 400 పైగా షాప్స్ 10- –50 ఫీట్ల వరకు కూల్చివేతలకు గురవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొందరు పూర్తిగా ఇండ్లు కోల్పోతున్నారు. వీటిల్లో రూల్స్ ప్రకారం కట్టిన ఇండ్లకు నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉండగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎవరికీ పరిహారం ఇవ్వడం లేదు. ఈక్రమంలో 28 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలు ఆపాలని కోర్టు స్టే ఇచ్చింది. అయినా పనులు కొనసాగించడంతో మున్సిపల్​కమిషనర్​కు హైకోర్టు మెమో జారీ చేసింది. దీంతో మున్సిపల్​ఆఫీసర్లు కూల్చివేతలు నిలిపివేశారు. 

చారిత్రక కట్టడాలు కనుమరుగయ్యే అవకాశం

ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్న ధర్మపురి ఆలయం రాష్ట్రంలోని వేద బ్రాహ్మణుల ముఖ్యమైన స్థావరాలలో ఒకటి. ధర్మపురి ఆలయం చుట్టూ ప్రాచీన కట్టడాలు పెద్ద ఇండ్లు, గడి, కోటలు కనిపిస్తుంటాయి. ఆలయానికి వచ్చిన భక్తులు మొదటగా వీటిని చూసేందుకు ఇంట్రస్ట్​చూపుతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ధర్మపురి ఆలయం చుట్టూ ఉన్న ఇండ్లు, పాత కట్టడాలను తొలగిస్తే ప్రాచీన కట్టడాలు కనుమరుగు అయ్యే అవకాశం ఉంది. 

కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేశాం

ధర్మపురి పట్టణ అభివృద్ధిలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. రూల్స్​కు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించి కట్టిన ఇండ్లు, షాపులను తొలగిస్తున్నాం. నష్టపరిహారం విషయం ప్రభుత్వం చూసుకుంటుంది. పై అధికారుల ఆదేశానుశారం పనులు జరుగుతున్నాయి.

- సీహెచ్ రమేశ్, కమిషనర్, ధర్మపురి