మెదక్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట, కొల్చారం మండలం రాంపూర్, కౌడిపల్లి మండలం ధర్మసాగర్, మెదక్ మండలం మాచవరం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టరేట్లో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు వంద శాతం మార్క్అవుట్ పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. గడువులోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించని వారికి వారం రోజులు గడువు ఇవ్వాలని, ఆ తరువాత వారి స్థానంలో వేరే వారికి ఇండ్లు కేటాయించాలని ఆదేశించారు.
మహిళా సంఘాలతో మాట్లాడి అవసరమైన లబ్ధిదారులకు లోన్లు ఇప్పించాలని, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ అయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, హౌసింగ్ పీడీ మాణిక్యం, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
