అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు : కె.శ్రీనివాస్​రెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు : కె.శ్రీనివాస్​రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు వంద శాతం ప్రయత్నిస్తానని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మీడియా రంగంలోని మార్పుల కారణంగా జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. కుల సంఘాల పేర్లతో కొందరు జర్నలిస్టులు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాగైతే జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకుండా పోతుందన్నారు. మంగళవారం బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. కె.శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

 ‘‘జర్నలిజానికి గౌరవం రావాలంటే అక్రిడిటేషన్ అవసరం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మందికి అక్రిడిటేషన్లు ఉన్నయ్. హైదరాబాద్​లోనే 4,500 మంది జర్నలిస్టులు ఉన్నరు. అక్రిడిటేషన్లు అర్హులకు మాత్రమే అందాలి. రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్ లైన్ చేస్తాం. హైదరాబాద్ చుట్టూ స్థలాలను గుర్తించి అర్హులైన జర్నలిస్టులకు అందజేస్తాం. సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇండ్ల స్థలాలను జవహర్​లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కో–ఆపరేటివ్ మ్యూచువల్లి ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నరు. త్వరలోనే స్థలాలు అప్పగిస్తాం’’అని శ్రీనివాస్​రెడ్డి అన్నారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డితోపాటు, సాక్షి మాజీ ఫొటో ఎడిటర్ రవికాంత్ రెడ్డి, జవహర్​లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ కో ఆపరేటివ్ మ్యూచువల్లి ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్​కుమార్, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ విరహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి వరకల యాదగిరి, ట్రెజరర్ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, రాజేశ్, సయ్యద్ గౌస్​మొయినుద్దీన్​లను రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం సన్మానించింది. యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కేఎన్ హరి, ఇతర సభ్యులు వారికి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, ఐజేయూ జాతీయ నేత వై.నరేందర్ రెడ్డి, హెచ్​యూజే ప్రధాన కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, ప్రముఖ సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్, రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ బీహెచ్​ఎంకే గాంధీ, కార్యవర్గ సభ్యులు నక్క శ్రీనివాస్, ఎంఏ సర్వర్, ఎండి.ఏలిమొద్దీన్, హరికృష్ణ, మోహన చారి, నగర గోపాల్, మహేశ్ కుమార్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.