వరంగల్, వెలుగు: హనుమకొండ జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు ఆరోగ్య భద్రత విషయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు. శనివారం గ్రేటర్ ప్రెస్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన టీయూడబ్ల్యూ (ఐజేయూ) మహాసభకు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు పంపిణీ మొదలు సంక్షేమానికి రేవంత్‍రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో యూనియన్ నేతలు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, విరాహత్ అలీ, గాడిపెల్లి మధు, వేముల నాగరాజు, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోష్, గడ్డం కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు.
