బహిరంగంగా వెళ్తే.. రహస్యం ఎలా అవుతది..భట్టితో మంత్రుల భేటీపై శ్రీధర్ బాబు

బహిరంగంగా వెళ్తే.. రహస్యం ఎలా అవుతది..భట్టితో మంత్రుల భేటీపై శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: బహిరంగంగానే తాము లోక్ భవన్ నుంచి ప్రజా భవన్ కు వెళ్లామని, అలాంటప్పుడు భట్టితో మంత్రుల రహస్య భేటీ ఎలా అవుతుందని  మంత్రి శ్రీధర్ బాబు మీడియా వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం లోక్ భవన్ లో జరిగిన ‘ఎట్ హోం’ ప్రోగ్రాం ముగిసిన అనంతరం అందరిముందు ఒకే కారులో భట్టి, ఉత్తమ్, తాను వెళ్లామని, ఇందులో రహస్యం ఎక్కడుందని మంగళవారం ఒక ప్రకటనలో శ్రీధర్ బాబు ప్రశ్నించారు. క్యాబినెట్ అనేది ఒక యూనిట్  అని, పాలనను సమన్వయం చేసుకోవడం మంత్రులుగా తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. 

తమ భేటీలో ప్రధాన చర్చ మున్సిపల్  ఎన్నికల సన్నద్ధతపైనే జరిగిందన్నారు. రాబోయే మున్సిపల్  ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు కావాలనే పనిగట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మకమైన విమర్శలను తాము స్వాగతిస్తామని, కానీ వ్యక్తిత్వ హననానికి, ఊహజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు. ఇకనైనా తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం మానుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.