ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే జాబ్స్‌‌ నుంచి తీసేస్తరా?

ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే జాబ్స్‌‌ నుంచి తీసేస్తరా?
  • ప్రజారోగ్య పరిరక్షణ సభలో ఎమ్మెల్యే ఈటల
  • ప్రతి దవాఖానలో వందల సంఖ్యలో ఖాళీలు..  వెంటనే భర్తీ చేయాలె

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్లు, నర్సులకు రెగ్యులర్ రిక్రూట్‌‌మెంట్‌‌లో ప్రాధాన్యమివ్వాలని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదన్నారు. ప్రతి ప్రభుత్వ దవాఖానలో వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలన్నారు. ఆదివారం హెల్త్ రిఫార్మ్స్‌‌ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌‌, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్‌‌, తదితర సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన ప్రజారోగ్య పరిరక్షణ సభకు ఈటల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య మంత్రిగా వాటన్నింటినీ పరిష్కరించే ప్లాన్లు సిద్ధం చేసుకునేలోగా కరోనా తగులుకుంది. కరోనా కట్టడికే సమయమంతా వెచ్చించాల్సి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే అధిక ప్రాధాన్యత విద్య, వైద్యానికి ఇస్తం. డాక్టర్లు, ఇతర హెల్త్ కేర్ వర్కర్ల వేతనాలు పెంచుతం. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వ దవాఖాన్లను తీర్చిదిద్దుతం’’ అని తెలిపారు.

కేసీఆర్‌‌.. కార్పొరేట్లకు బ్రాండ్ అంబాసిడర్
వైద్య రంగంలో రెగ్యులర్ విధానంలో పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఏళ్ల తరబడి ఇన్‌‌చార్జ్ హెచ్‌‌వోడీలతో నెట్టుకురావడం వల్ల అర్హులు నష్టపోతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేందుకేనని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు. ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్‌‌మెంట్ తీసుకుంటేనే ప్రజారోగ్య వ్యవస్థ బాగుపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ కార్పొరేట్ హాస్పిటళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. ప్రభుత్వ దవాఖాన్లలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పే కేసీఆర్, తనకు పంటి నొప్పి వస్తే ఢిల్లీలోని దవాఖానకు, చేయి నొప్పి వస్తే యశోద హాస్పిటల్‌‌కు ఎందుకు పోతున్నారని ప్రశ్నించారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా ఉండాల్సిన వ్యక్తి, కార్పొరేట్ హాస్పిటళ్లను ఎంకరేజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలె: డాక్టర్లు
ప్రభుత్వ దవాఖాన్లలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్ల సంఖ్య పెంచాలని, 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండేలా కేడర్ స్ర్టెంత్ పెంచాలన్నారు. సీనియారిటీ ప్రకారం డాక్టర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ దవాఖాన్ల ప్రొటెక్షన్ కోసం ఎస్‌‌పీఎఫ్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.