గాంధీ ఎట్ల సూసైడ్ చేసుకున్నరు?

గాంధీ ఎట్ల సూసైడ్ చేసుకున్నరు?

గుజరాత్​లోని ఓ స్కూల్​లో పిచ్చి ప్రశ్న

ఎంక్వైరీకి ఆదేశించిన విద్యాశాఖ అధికారులు

అహ్మదాబాద్: మహాత్మా గాంధీ ఎట్ల సూసైడ్ చేసుకున్నరు? అరే.. ఇదేం ప్రశ్న అనుకుంటున్నరా? గుజరాత్​లోని గాంధీనగర్​లో ఓ స్కూల్​లో ఇట్లనే అడిగారు మరి. దెబ్బకు గుజరాత్ విద్యా శాఖ అధికారులంతా షాక్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ‘సుఫలం శాల వికాస్ సంకుల్’ అనే సంస్థ కింద గాంధీనగర్​లో స్కూళ్లు నడుస్తున్నాయి. 9వ తరగతి స్టూడెంట్లకు ఇంటర్నల్ అసెస్​మెంట్ ఎగ్జామినేషన్​నిర్వహించారు. అందులో ‘గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?’ అని గుజరాతీలో ఓ ప్రశ్న ఇచ్చారు. అంతేకాదు.. 12వ తరగతి స్టూడెంట్లకు మరో పిచ్చి ప్రశ్న ఇచ్చారు. ‘మీ ఏరియాలో మద్యం అమ్మకాలు పెరగడం, దొంగసారా అమ్మే వారి ఆగడాలు ఎక్కువ కావడంపై జిల్లా పోలీస్ చీఫ్​కు ఫిర్యాదు చేస్తూ లెటర్​రాయండి’ అని అడిగారు.

అసలు మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్​లో ఇలాంటి ప్రశ్న అడగడమేంటనిఅధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నలు అభ్యంతరకరమని, విచారణకు ఆదేశించామని, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని గాంధీనగర్ విద్యా శాఖ అధికారి భరత్ వధేర్ చెప్పారు. క్వశ్చన్​పేపర్లను స్కూల్ మేనేజ్​మెంట్ రూపొందించిందని, వాటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సంస్థ ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందుతుండటం మరో విడ్డూరం.